పుట:Bobbili yuddam natakam.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

[ద్వితీయ తృతీయాంకముల నడుమ]

విష్కంభము.

స్థలకము: - పెద్దచెఱువు నీరాట రేవు.

[కతిపయ బ్రాహ్మణులు యథోచితముగ ప్రవేశింతురు.]


వేదాంతి. - శాస్త్రులుగారూ, అవు నయ్యా, నీమాట నిజమే ! ఎంత దండు ఎంతదండు ! వీరు ఈచెఱువును ఈప్రక్కనుగూడ చుట్టవేసినయెడల ఊరికి ఇప్పటికి ఈనీళ్లు దొరకకపోవును.

శాస్త్రి. - వేదాంతిగారూ, ఈమాఱు రాజు మంచిరాజనీతిని ప్రయోగించినాఁడు. పెండ్లిసమయ మగుటచేత మనదొరలు ఎదిరి పోరనేర రని, మనయూరిమీఁదికి ఈగోలకొండసిద్దీలను పౌఁజును తెచ్చినాఁడు. [అందఱ నుద్దేశించి] అయ్యా, బ్రాహ్మణోత్తములారా, మనప్రభువునకు జయము కలుగునట్లుగా ఈసమయములో మనబ్రాహ్మణోపాయములు ఎవరికి తెలిసినవి వారు చేయరాదా ? పురుష ప్రయత్నముచే గ్రహ దోషములుకూడ తొలఁగి మేలు కలుగును గదా ?

          ఆ. వ్రాఁత దైవ మండ్రు, చేఁతఁ బౌరుష మండ్రు;
              వ్రాఁత ప్రబలమేని చేఁత నణఁచు ;
              చేఁత ప్రబలమేని వ్రాఁత నడంచును;
              గానఁ గడిఁది జతన మూనవలయు.

అయ్యా, జోస్యులుగారూ, ప్రశ్న చెప్పుఁడు.

జోస్యుఁడు. - యుద్ధప్రశ్న, శీఘ్రమే. హా ! ఈరాత్రియే యుద్ధము జరుగును.

ఇతరులు. - ఎవరికి జయము ? ఎవరికి జయము ? రాజునకా రాయనింగారికా ?

జోస్యు. - ఎవరికిని లేదు. గ్రహములు చాల గందరగోళముగా నున్నవి. [అని నిష్క్రమించును.

విద్యార్థి. - నేను రంగారాయనింగారికి జయము కలుగునట్లుగా నాపాఠములను మానుకొని సుందరకాండ పారాయణము చేసెదను. [అని నిష్క్రమించును.

కవి. - అది దినములపని. నేఁడే యుద్ధము జరిగిన నదీ కార్యకారి కానేరదు. కావున నేను రాయనింగారికి జయము కలుగునట్లుగా అమృతబీజములను, విజయరామరాజునకు కీడు కలుగునట్లుగా విషబీజములను, పెట్టి పద్యాలు చెప్పెద. [అని నిష్క్ర.