పుట:Bobbili yuddam natakam.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

బొబ్బిలియుద్ధనాటకము.

మంత్రాలోచన సభకు రమ్ము. తమ్ముఁడా నాచేరువకు రమ్ము. [అని రాఁగా కవుంగిలించి] ఱేపు ఉందుమో, ఉండమో ? ఒకతల్లికడుపునఁ బుట్టితిమి, ఒక్కటే మనస్సుగా ఆత్మగా బ్రతికితిమి. తమ్ముఁడా, ఎన్నఁడైన నీయుత్సాహములకు భంగము చేసియుంటినా ? నావలన నీ కే మయినం గొఱఁత కలదా తమ్ముఁడా ?

వెంగ. - ఏమి యన్నయ్యగారూ ! ఇట్లు పలికెదరు ! తమవలనను నాకు భంగమా ? తమవలన నాకు కొఱంతయా ? బాలుఁడ నైన నాదుండగములను, తప్పులను మన్నింపవలయును.

రంగ. - నీవంటి తమ్ముఁడు నాకుఁ బైపుట్టువునం గలుగునా ?

వెంగ. - నేనే మెఱుఁగుదును ? ఎట కైనను తమశుశ్రూషకు రాక నేను మాత్రము వెనుకఁ దగ్గుదునా ?

రంగ. - రమ్ము తమ్ముఁడా, రమ్ము. (అని కవుంగిలించి, ముద్దుగొని) దైన్యమని తలంపకుము, వీరుల మయినను మనుష్యులమే గదా ?

[అంతట వేగులు వేగముగ ప్రవేశింతురు.]

వేగులు. - జయం జయం ఏలినవారికి ! మహాప్రభో, ఎదిరి దండులోని తల మానుసులని తెలుసుకొని వచ్చినాం, మహాప్రభో !

రంగ. - ఎవ రెవరు ?

వేగులు. - మహాప్రభో, ఒకడు విజయరామరాజు.

రంగ. - [స్వగతము] అతఁడు కూడ నొక తలమానిసి యఁట? ఈ చేఁతకు త్వరలోనే తలలేనిమానిసి అగును [ప్రకాశము] ఇతరులను చెప్పుఁడు.

వేగులు. - గోలకొండవారి యీపౌజు కంతా మొనగాడు మూసా బూసీ అనే ఫరంగిదొర. వారి ఫిరంగీకి దొర్లని కోట యీదేశంలో లేదట. హైదరుజంగు సాయెబు అతనికి దివాను. సర్దార్లు మరాటి భూములు, కల్బర్గసంస్థానము, భువనగిరిసంస్థానము కొట్టిన ఖానులంట ఇంతేనండి యిప్పటికి తెలిసింది.

రంగ. - సరే పోయి రండి.

వేగులు. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమింతురు.

రంగ. - ఏడు మాఱులు ఇతనిని నేను జయించితిని. ఈ మాఱు నన్ను ఇతఁడు త్రొక్కివైచినాడు. గోలకొండవారికి నేను ఏమియు ఇతనికన్న అపరాధము చేయ లేదు. పేష్కన్సు ఇతఁడును చెల్లింపనివాఁడే గదా ? వీరు ఇతనిని మాని నన్ను ముట్టడించుట చూడఁగా, ఇతఁ డేమో కుట్రచేసి వీరిని నామీఁదికి తెచ్చినాఁ డనుట నిశ్చయము. ఈరాజు సమయము వేచి నన్ను చిదుగఁ గొట్టినాఁడు. పెండిండ్ల సమయ మిది