పుట:Bobbili yuddam natakam.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

బొబ్బిలియుద్ధనాటకము.

          తే. ఎత్తి వచ్చెనొ కూళరా జిట్టిహదన ?
                   నింతటి ఫిరంగి యాతని కేడఁ జెపుమ ?
              తమ్ముఁడా, రమ్ము మనమె బేతాళబురుజు
                   నెక్కి కనుఁగొంద మావింత యేమొ యిపుడు. ౨౭

              రా, తమ్ముఁడా, రా, బేతాళునిబురుజెక్కి ఇదేమో చూతము.
                                      [ అని బురు జెక్కుట నభినయింతురు.

వెంగ. - ఆహా ! ప్రొద్దు పొడుచుచున్నది ! చీఁకటి చెదరుచున్నది. [నలుగడం బరికించి] అన్నయ్యగారూ, ముట్టడి ! ముట్టడి ! ఆ యేనుఁగు లేమి ! ఔరా ! ఆ గుఱ్ఱము లేమి ! అబ్బా ! ఆ ఫిరంగుల బారు లేమి ! ఎన్ని డేరాలు ! ఎన్ని డేరాలు ! ఎంత కాల్బలము ! దేవ అవధారు ?

          సీ. వీరబొబ్బిలి యిదే పేరుపొందినలంక,
                  యీ రాణువే యకూపార మౌర !
              కాల్బలంబులె యుదకంబులు, మేల్తురం
                  గంబులే ఘనతరంగంబు లౌర !
              వాటంపుడేరాలె వట్టిమేఘంబులు,
                  మత్తేభములె నీరుమబ్బు లౌర !
              కడిది ఫిరంగులే కాలకూటంబులు,
                  కైదువులే భుజంగంబు లౌర !

         తే. అవలిదరి లేదు, గణుతికి హద్దు లేదు,
                  కనము, విన, ముట్టిముట్టడి కలల నైన !
              నెవరొ ? వీ రేల వచ్చిరో ? యెఱుఁగవలయు ;
                  దిగుచునే యున్న దింక నల్దెసల దండు. ౨౮

రంగ. - [పరికించి] అవును తమ్ముఁడా ! ముట్టడియే ! ఇంతదండు విజయరామునికి లేదు. మఱి, మన కెవ్వరును పగవారు లేరు. వీ రెవ్వరు.

ప్రతీహారి. - [ప్రవేశించి] జయం జయం శ్రీరణరంగమల్ల బొబ్బిలిమహారాజ రంగరాయమహాప్రభువువారికి. వేగులు వచ్చినారు.

రంగ. - వేగులకు నేఁడు తెలుపుడు లేకయే, ప్రవేశము కలిగింపుము.

ప్రతీ. - ఏలినవారి ...... [అని నిష్క్రమించును.]