పుట:Bobbili yuddam natakam.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాంకము.

స్థలకము: - బొబ్బిలికోట - అంత:పురము

[అంతట రాణియు పెండ్లికొమార్తులును దాసీజనమును ప్రవేశింతురు.]

రాణి. - [నిర్వర్ణించి] ఆహా! ఊరేఁగింపు మహలుదర్వాజాకడకే వచ్చినది ! ఓహో యెంతరమణీయముగా నున్నది ! [పెండ్లికొమార్తులను ఉద్దేశించి] నాబంగారు కొండలారా, మీ రందఱు కిటికీలకడ నిలిచి కనులపండువు గావించుకొనుఁడు. (చిఱునవ్వుతో) మఱి మీరు వెలమకన్యలు, ఒక్కొక్కతయు తనభర్తను మాత్రమే చూడ వలయును.

కొందఱుకన్యలు - [చిఱునవ్వుతో] వెలమకన్యలకంటికి ఇతరులఁఏల యగపడుదురు ? ఇతరులకంటికి వా రేల యగపడుదురు ? [అని అందఱును పరిక్రమించి ఊరేఁగింపు చూచుట నభినయింతురు.

రాణి. - ఓసీ ; వేంకటలక్ష్మీ, నీకు ఏలినవారు చదువులు చెప్పించి పెద్దదాసి యధికార మిచ్చినందులకు తగినట్లుగా ఈముద్దరాండ్రకు ఈయూరేఁగింపులోని విశేషములను వర్ణించి విశదపఱుపుము.

వేంకట - దేవిగారియానతి. మఱిచిత్తగింపుఁడు.

          క. ఆకాశబాణము లవే
              యాకాసంబునకు నెగసి, యమరుల చెంతన్
              రాకేందువులుగ, బాల ది
              వాకరులుగఁ, బేలి, కలయఁ బర్వెడుఁ గనుఁడీ. ౨౧

మఱియు: -

         శా. ఏయే వన్నె సులోచనం బిడుదుమో యీ చుట్టుప ట్లప్పుడే
               యాయావన్నెవిగాఁ గనంబడుఁ గదా ; యామాత్రమే గా కివే
               స్ఫాయద్వర్ణము లౌమతాబులు ప్రకాశం బొంద నాతేజులన్
               క్ష్మా యెల్లన్ స్ఫుటదృశ్యతావిభవమున్ గాంత్యుచ్ఛ్రయంబుం గనెన్.

పెండ్లికొమారితలు. - వేంకటలక్ష్మి మహాకవీశ్వరురాలుగా నున్నదే !

వేంకట. - మఱియు వినుండు: -