పుట:Bobbili yuddam natakam.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

బొబ్బిలియుద్ధనాటకము.

సుబ్బన్న. - ఓయి, నీయిల్లు బంగారంగానూ ! ఇదెక్కడి ఆబ ! భీమయ్యా, రామయ్యా, ఇతణ్ణి మోసుకొనివెళ్లి, మీ రిద్దఱు నిన్న యిలాంటివాణ్ణే ఒకణ్ణి వేడి వేడి అట్లు కడుపుమీద వెయ్యించి, లోపలినెయ్యి కరిగించి, కడుపు సళ్లించి, బ్రతికించాడే రాయనింగారి వైద్యుడు, అతడిదగ్గరికి పట్టండిరా; లేకపోతే, యితడిమూలంగా రాయనింగారికి బ్రహ్మహత్య వొస్తుందిరా !

రామయ్య, భీమయ్య. - ఔనురా ; [అని బ్రాహ్మణుని ఝడ్డిపట్టి మోచుకొని నిష్క్రమింతురు.

సుబ్బన్న. - [నిర్వర్ణించి] బూరెకు వరహా చొప్పున వెయ్యిన్నీ నూట పదహార్లు సంపాదించినాడే, ఓయి బాబో! ఆబకాసురుడు వెంకన్న వొస్తున్నాడు !

(అంతట వెంకన్న ప్రవేశించును.)

సుబ్బన్న. - వెంకన్నా, ఏమయ్యా, నీ వెయ్యిన్నీ నూట పదహార్లు మాకు రవంత చూపవయ్యా.

వెంకన్న. - అవి నాభోజనం మీద, కందాలు చెప్పిన కవికి, కందాలు చెప్పిన వాడే కవిగదా, అని, ఇచ్చేశా.

అందఱు. - వహవ్వా! వహవ్వా! భోజనరాజవయినావే! ఏవయ్యా, ఆకందాలు? విందాం.

వెంకన్న. - వినండి మఱి: -

         కం. వెంకన్న తిండి జూచిన,
              నంకాళమ్మకును సైత మరగుండె వడున్;
              కొంకును బూరెలు మెక్కెడు
              వెంకనకు జగములు మ్రింగు విశ్వాంతకుఁడున్ ౧౮

అందఱు. - బళి బళి~ ఇంకా మఱి;
వెంకన్న. - వినండి మఱి: -

         కం. ఊటగల యావకాయలు
              పూఁటకు డెంకాయ బొండ్లములపాటివి నూ
              ఱాఁటవు వెంకన్నకు నసి
              పాటిత దధి గండ మిశ్ర భక్తంబునకున్. ౧౯

అందఱు. - వహవ్వా! వహవ్వా! ఇంకా మఱి ;