పుట:Bobbili yuddam natakam.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 16

యంలేదు. ఈయనపైగా నిజాంగారికి, ఎక్వా మెహనత్తు చేసి ఎర్గీ వున్న జమీన్ దారుడు. ఇతనికి కొట్టడం వారికి షమ్మతం వుండదు. కన్క, ఈయన్కి మనవషంమే వుంచుకొని, ఇతడిసాయంతో బొబ్బిలికి కొట్టి, వెంటనే ఇత డియ్యవల్శిన పైకంకి వసూలుచేసికొని, శ్రీకాకుళం వెల్లడం షరి యని నాకీ తోస్తుంది. మఱి ఇటుతర్వాత రంగారావు వల్ల ఇతడికి హపాయం తప్పించడముకి ఈయన చెప్పేది వుపాయం యేమ్టి అంటే - బొబ్బిలివారికి దూరాన పాలకొండసీమ ఇచ్చి, ఈయనకి బొబ్బిలి యిస్తే బొబ్బిలిపైకం కూడా తానే చెల్లిస్తా నంటాడు. అది షరి నాకీ తోస్తుంది. మఱి యితడిషాయం లేక్పోతే మన్మూ బొబ్బిలికి ఎక్వా మందికి మనసిపాయీలకి బలీ వెయ్యవాలా వుంటుంది. అటుపైని తమది చిత్తం.

బుస్సీ. - [అపవారించి] మీరు చెప్పిన దంతయు యుక్తియుక్తముగానే యున్నది. బొబ్బిలిని కొట్టుట యేమో సిద్ధమే; కాని ఒకరి భూములఁ దీసి ఒకరి కిచ్చుటకు మన కే మధికారము?

హైదరు. - [స్వగతము] అబ్బ ! ఎక్కడికి వెల్లినా యీఫరంగివాడితో ఇదే తంటా! [ప్రకాశము] కొట్టడాన్కి యేమీ అధికారమో భూములు మార్చడాన్కి అదే అధికారం. ఆలాగ చెయ్యకపోతే గోధారికి వుత్తరం పరగణాలన్ని మన్మూ వొదులుకో వలిశిందే. ఈరాజున్ను ఆరావున్ను సఖ్యపడితే మన్మూ యెన్కాకి తరలవలిశిందే. వీరిలో వీరికి కలతపడినందుకీచేత మనకీ అడుగు మోప్డానికి హవకాశం దొర్కింది. కన్క వీరిపగలు ఉన్నలాగే వుంచి, మనపని మనం నెరవేర్చుకోవాలా. బొబ్బిలి వీరికి యిచ్చి వారికి ధూరం తరిమితే, పగలు తీరవు, పైకం చెల్లుతుంది. నిజాంగారి ఖుద్దున మన్ముఖజానా రాశి పొయ్యవచ్చును. కన్క యీమార్పుకీ మన్ము వొప్పక తప్పదని నాకీ నమ్మకం.

బుస్సీ. - మంచిది, మీరు ఈదేశమువారిని, మాకన్ఁన చక్కఁగా ఎఱిఁగినవారు; కావున మీరు చెప్పినట్లు ఒప్పుకొనియెదను.

హైదరు. - మహారాజా; మీరు చెప్పిన వుపాయాన్కి ధొరవారు వప్కొన్యారు. తమరు కూడా బొబ్బిలిమీదికి మాతో రావాల.

రాజు. - సర్వసిద్ధము. మిక్కిలి సంతోషము. బూసీదొరవారికిని మీకును మిక్కిలి కృతజ్ఞుఁడను. [ఆత్మగతము] ఆహా! యేమినాయదృష్టము! ఆహా! నాప్రక్కలోని బల్లెము ఊడినదిరా. బొబ్బిలిలో ఆవలి యెల్లుండి పగలు 50 పెండిండ్లు, రాత్రి యూరేఁగింపు. తాండ్ర పాపయ్య రాఁడు. వచ్చినప్పటికిని వెంటనే రాజామునకు పోవును. ఆరాత్రి తెల్లవాఱునప్పటికి ముట్టడి పడిన, కరముజయకరముగా నుండును.