పుట:Bobbili yuddam natakam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 14

రాజు. - ఉపాయము సిద్ధమే; అయినను రాతిగోడలకే చెవులు గల వందురు, డేరాగుడ్డల మాట మఱి చెప్పవలయునా?

హైదరు. - అయితే యీలాగారండి. [అని రాజును అన్యులనుండి ఆవలికి తోడ్కొనిపోయి] ఇక్డ శెలవియ్యవచ్చును.

రాజు. - వినుఁడు మఱి; మీరు బొబ్బిలి కొట్టరేని మీకు బొబ్బిలిపైకము రాదు. కొట్టినను, సర్కారుపైకము సర్కారునకు దక్కును. మీకష్టము మీకు దక్కును. కావున, అట్లు గాక మీరు బొబ్బిలి కొట్టి బొబ్బిలివారికి పాలకొండమన్నెము నిచ్చి మాయన్నగారి కుమారుఁడు ఆనందగజపతికి బొబ్బిలిని పట్టము కట్టినయెడల బొబ్బిలిపైకము కూడ మేమే చెల్లించుట గాక, బుస్సీదొరకు తెలియనీక, మీకు లక్షవరహాలు కట్నము సమర్పించెదము. ఇట్లు మీరొనర్చిన, బొబ్బిలివారివలనియిడుమలు మాకుండవు; పైకము వసూ లగుటకు మీకు ఏ చింతయు నుండదు. ఈసూక్ష్మమును మీరు అవధరింప వలయును.

[హైదరు ఆలోచించుట నభినయించుచుండును.

రాజు. - [స్వగతము] రంగాలాయఁడు బ్రతికియున్నంతకాలము భూమిలో ఎంతదూరాన నున్నను మాకు రాజ్యభ్రంశంబు, ప్రాణాపాయమును, తప్పవు. ఈప్రయోగముచే రంగారావు మడియును. ఎట్లన, బొబ్బిలి వదలి పాలకొండ కేఁగ నతఁడు, ఒడంబడఁడు. దానంజేసి, పోరాటము తప్పదు. పోరాటములో పరాజ యావమానము నొల్లఁడు ; అతనికి ఈపరాసులమీఁద జయ మసాధ్యము; కావున అతనికి రణమరణము నిశ్చితము. కాన, అతఁడు బ్రతికియుండి కాలాంతరమున మమ్ము బాధించు నను భయము లేశ మయినను ఉండదు.

హైదరు. - [ఆలోచించుట నభినయించి] వహవ్వా ! వహవ్వా ! బాగాకుదిరింది. తమరు కోరినపని నేనుచేస్తాన్. నాకి లక్షవరాలకీ ఏమి జామీను?

రాజు. - మీరు మాపని నెఱవేర్చుటకు మాకేమి జామీను ?

హైదరు. - [ఒరనుండి తరవారు దూసి] ఇద్గో యీకైజారు జామీను.

                 మెచ్చీనారూ మాదీ మేహర్బాన్కీ చూచి;
                       యిచ్చీనారూ మాకీ కైజార్.
                యవ్రంటే ? గోల్కొండా యేలే పాచ్ఛాగారు,
                       యివ్రంగా మీకీ మేం చెప్నాం.
                యిల్లిద్గో పాచ్ఛాహి యిచ్చిన కైజారు,
                       హల్లా సూస్తాడూ మేం అంటాం.