పుట:Bobbili yuddam natakam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 13

హర్కా. - తర్వాత రంగారాయనింగారు "ఏమిరా పరాసులూ, కరాసులూ, బూసులూ, పిసాసులూ, వచ్చినా రని మమ్మల్ని బెదిరిస్తా రంట్రా మీరు? ఇలాంటి బూసులకు మేము భయపడ మని చెప్పరా. ఇలాంటివి వొకటిగాదు వందలువందలు జంగుబిల్లులు మా అడవినిండా వున్నా యని చెప్పండ్రా. మరాటిభూములని కొట్టినా రంట్రా? కాదురా, బొబ్బిలిజ్వరానికి, మరాటిమొగ్గలు కషాయం పెట్టుకొన్నార్రా. వాళ్ల బేటికి మమ్మల్ని పిలవడానికి మీరాజుకూ బుద్ది లేదు, మేము వొస్తామని తలవడానికి వాళ్లకీ బుద్దిలేదు." అని కోపం చేసి పటపట పటపట పళ్లుకొఱికినారు మహాప్రభో.

హైదరు - బుస్సీ - రాజు. - [మొగమొగంబులు సూచుకొని] తర్వాత? తర్వాత?

హర్కా. - తర్వాత, మేము చేతులు జోడించుకొని 'మాయేలినవారికి ఏమి జవాబు మహాప్రభో' అని యడిగినాము. అంతట - 'మేము మీవంటి పందలం గాము, మేము గోలకొండ నిజాముగారి కెదురు వెళ్తామేగాని, వారినౌఖర్లకి, యెదురువెళ్లము, జరూ రుంటే, ఆనౌఖర్లు మాబేటికి రావొచ్చును; నిజాముగారి నౌఖర్లు గనక బేటీ యిస్తాము.' అనిమేము శెలవిచ్చినామని మీరాజుతో చెప్పుకోండి. - అన్నారు. 'మహా ప్రభో, ఏలినవారు ఆలాగ శెలవియ్యవలసిన సమయంకాదు. బేటికి వెళ్లకపోతే శానా చెరుపు వుంటుంది.' అని మేము మనివి చేసుకొన్నాము. "కబురుదెచ్చే జవాన్ గాడ్దలు మాకు బుద్దులూ సుద్దులూ చెప్తున్నారోయి." అని వారితమ్ములు వెంగళరాయనింగారు మమ్మల్ని చెంపలుగొట్టి తన్ని తగిలేశినారు, మహాప్రభో. ఆపైని యెకాయెకిని వొచ్చి యేలినవారిని ఇక్కడ కండ్లజూచినాము.

బుస్సీ. - వీరిని పొ మ్మనుఁడు.

రాజు. - పొండిరా మీరు.

హర్కా. - ఏలినవారియాజ్ఞ.

బుస్సీ. - మఱి మీపైకమునకు ఏమిచెప్పెదరు?

రాజు. - ఇఁకమీద ఎన్నటికిని వారివలన మాకు ఉపద్రవము లేకుండునట్లు చేసిననేగాని, మాకు డబ్బు పుట్టదు.

బుస్సీ. - ఏమి హైదరుజంగుబహద్దరు? మహారాజాగారు చెప్పినమాటకు ఏమి యుత్తరము ? మనము ఇప్పుడు బొబ్బిలివారిని కొట్టి బాకీ వసూలుచేసికొని పోఁగలము గాని, ఱేపటికి వారు వీరిమీఁదికి రాకుండ మన మెట్లు చేయఁగలము ?

హైదరు. - అందుకీకోషం వుపాయం యేమైనా తమరు ఆళోచించివున్నారా మహారాజా ?