పుట:Bobbili yuddam natakam.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

బొబ్బిలియుద్ధనాటకము. 12

రాజు. - నేనును హర్కారాలచేత జాబు పంపితిని. అతఁడేమో రాలేదు. అతఁడు మిమ్మును మమ్మును సరకు సేయువాఁడు కాఁడు.

[బుస్సీయు హైదరును మొగమొగంబులు చూచుకొందురు.

బుస్సీ. - మఱి మీ హర్కారాలు వచ్చి ఏమి చెప్పినారు?

రాజు. - హర్కారాలు ఇంకను రాలేదు. వారిని అతఁడు ఖూనీ చేయించినాఁడేమో యని మాకు భయముగా నున్నది.

దౌవారికుఁడు. - (ప్రవేశించి) సలాం సర్కార్, దర్వాజాకాడ మహారాజావారి హర్కారాలు బొబ్బిలినుంచి వచ్చివున్నార్.

రాజు. - సంతోషము! సంతోషము!

హైదరు. - వహ్వా ! వహ్వా ! సమయాన్కి వచ్చినార్ ! రమ్మన్.

[దౌవారికుడు నిష్క్రమించును.

(అంతట హర్కారాలు ప్రవేశింతురు.)

హర్కా. - దండం దండం యేలినవారికి. ఆలాంటిచెంపపెట్లు మేము దప్ప మఱెవ్వరును తినివుండరు. వీరభద్రుడిచేత దక్షప్రజాపతిసమేతా తినివుండడు మహా ప్రభో.

రాజు. - మాజాబు రంగారాయనింగారి చేతికి ఇయ్యలేదా?

హర్కా. - వారి తమ్ములు వెంగళరాయనింగారు, విజయరామరాజుగారి జాబనగానే, మాచేతులలోనుంచి జాబు పెరుక్కొని, విజయనగరమువాడికి - [అనియర్థోక్తిలో] మహాప్రభో, మన్నించాల, వారినోట వొచ్చినట్లే మానోటోచ్చేసింది మహాప్రభో. [అని సాగిలబడి లేతురు.

రాజు. - అంతయు మన్ననయే, చెప్పుడు. వారినోట వచ్చినట్లే చెప్పుఁడు.

హర్కా. - 'విజయనగరం వాడికి, మాకు జాబులు జవాబులు వున్నాయా' అనీ ఆజాబు చింపేశినారు. మఱి మేము గుండెనిబ్బరం చేసుకొని 'కాదు మహాప్రభో, పరాసు లొచ్చినారు, గోలకొండవారు లక్షాడబ్భై రాణవతో బూసీదొరగారిని, హైదరుజంగుగారిని, జమాబందికి పంపించినారు. అంత లేసి మరాటి భూములు హతముచేసిన ఆదొరలు రాజమహేంద్రవరంకాడ దండుదిగివున్నారు. మహారాజులుంగారు అక్కడికి వారిబేటికి వెళ్లుతా తమరిని గూడ ఎదురుచూస్తావున్నారు. మునపటికోపాలు మఱిచి, యీసమయంలో దయచేసి రావలిశిందని తమరితో మనివి చెయ్యమన్నారు.' అనిచెప్పినాము.

బుస్సీ - హైదరు - రాజు. - తర్వాత తర్వాత?