పుట:Bobbili yuddam natakam.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 11

              మాదం డతనిమ్రోల మాయించి, యాతని
                    మెడఁ గోసి, కననీక మేకుఁ జొనిపి,
              దిసమొల గావించి, కసవుగోణం బిడి,
                    మోమున ఱొమ్మునఁ బొట్టమీఁద

         తే. వీఁపునం బట్టెనామాలు వెట్టి, శవము
                   నందళంబునఁ గూర్చున్న యట్లు కట్టి,
             విజయనగరంపు నడివీథి వింత లడరఁ
                   బగలె మాదేవిడీఁ జేర్పఁ బంపినాడు. ౧౦

ప్రకృతము వారి రాజాముఠాణామీఁదికి మేము దండు పంపినారము. మేము అటకు తరల నుండఁగా అచ్చటకి వారి దళవాయి తాండ్రపాపయ్య పోయినాఁ డని తెలియవచ్చినది. అంతట రాజాముదాడి మాని బొబ్బిలిమీఁదకే స్వయముగా తరల నుంటిమి. ఇంతలో మీకబురు రాఁగానే మీబేటికి వచ్చితిమి.

హైదరు. - తాండ్ర పాపయ్యకీ కోషం తమరు దాడీయెందుకీ మానినార్?

రాజు. - తాండ్రపాపయ్య పేరు విన్న, వైరుల కెల్ల సింహస్వప్నము. అతఁడు చొచ్చెనా, యెదిరిదండు పులి చొచ్చిన గొఱ్ఱెలమందయే.

       క. ఉండును రాయనినేనిన్
          భండానం దొడరువాఁడు; పాపయ్యను మా
          ర్కొండు నను వీరుఁ గానీ
          దండును గానీ సృజింప ధాతయుఁ దలఁకెన్. ౧౧

బుస్సీ. - ఏమి, మహారాజా, మీరు అతనిని పొగడువిధము చూడఁగా, మీసంస్థానమును అతనివలన బట్టుజాగీరుగా ననుభవించుచున్న ట్లున్నది గాని, గోలకొండవారిక్రింద జమీను ఏలునట్లు అగపడలేదే1

రాజు. - ఏల; త్వరలో మీకే తెలియును, చెంతకు వచ్చితిమి గదా?

హైదరు. - షరే గాని, రంగారాయడికి వేయి తల్కాయలా యేమి? ఇతనేమిరాకాశిమన్నీ డా? మన్సీ కాడా? మీ రావణాశురుడు వున్నాడే, రాముడి బీబీకి పకల్డేవు చేసినవాడు, వాడికి వాడితో గుణాకరించి, ఆవొచ్చిం దాన్కి, మల్లీ వాడితో గుణించి, చేసినాడా మీభ్రమాదేవుడు వాడ్కి?

బుస్సీ. - అతఁడు ఏల మాబేటికి రాలేదు?