పుట:Bobbili yuddam natakam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము. 5

రాజు. - [ఆత్మగతము] చక్కఁగానే తయ్యారు చేసినాఁడే అప్పన్న ! [ప్రకాశము] హా ! ఏమి దీమసము ! ఏమి దీమసము ! [అప్పన్నతో, జనాంతికము] మఱి పరాసులరాక అక్కడవారి కే మయిన తెలిసిన ట్లున్న దేమో కనుంగొనుము.

అప్పన్న. - [జనాంతికము] నే నప్పుడే విచారించితిని. తెలిసినజాడ లేదఁట మహాప్రభూ.

రాజు. - [స్వగతము] అది నాప్రయోగమునకు కర మనుకూలము. [అప్పన్నతో జనాంతికము] కోటలో పెండ్లిండ్లు ఎట్లున్నవో కనుఁగొంటివా ?

అప్పన్న. - [జనాంతికము] ఏఁబది పెండిండ్లు జరుగనున్న వఁట.

రాజు. - [అప్పన్నతో జనాంతికము] తాండ్రపాపయ్య బొబ్బిలికివచ్చినాఁడా?

అప్పన్న. - [జనాంతికము] పాపయ్య పితూరీలు అణఁగఁగొట్టుటకు రాజాములోనేయున్నాఁ డట.

రాజు. - [వికటముగా నటు నిటు పరిక్రమించుచు, ఆత్మగతము] బళీ, అక్కఱకు వచ్చినవి రాజాముసీమలో నాచేయించిన పితూరీలు ! పితూరీదార్లకు సాయముగా నేఁ బంచినరాణువ అక్కడ చాటున మాటున కావలసినంత యున్నది. కనుక ఆపితూరీలు రావణాసురుని తలకాయలే అగును. ఇతఁడు బొబ్బిలికి రాఁజాలఁడు. ఎట్టకేలకు వచ్చె నేని అంచెలమీఁద వచ్చి, ముడులు పడఁగానే, అంచెలమీఁదనే మరలును. [ఆలోచించి, హర్షముతో] వహవ్వా ! బుస్సీ బేటికి రంగారావు రామి నాకు దేవుఁడు ఇచ్చినవరము. నాకార్యసిద్ధికి ఇదియే బీజము. దుస్సీ హైదరులను ఇతనిపైకి ఎసకొల్పుటకై నాచేసిన సంకల్పము నెఱవేఱినది ! ఇతఁడు లేనందున నాయిచ్చవచ్చినట్లు వారికడ నితనిని కొంకులు నఱకెద. ఎంత లంచ మైనను ఇచ్చి వారిచే ఈవెలమలను రూపు మాపించి, మా యానందరాజునకు బొబ్బిలి పట్టము గట్టించుకొనియెద. [మహౌద్ధత్యముతో] నేను ఈబొబ్బిలిమీఁద

కాకుల గ్రద్దలఁ గాఱాడింపనేని కాను విజయరాముఁడ.

వీరబొబ్బిలిఁ గాల్చి పేరు మాపనేని - కాను ...

రావుపురవు నెల్ల గావు వెట్టనేని - కాను ...

నీటుఁగోట పాటి బాట సేయనేని - కాను ...

ఆముదాలు సల్లి యానందింప నేని - కాను ...

పొగతోఁట వేసి యాపొగ పీలువనేని - కాను ...

కోటను బులివేఁట కోన సేయనేని - కాను ...

ఆనందు బొబ్బిలి కభిషేకింపనేని - కాను ...