పుట:Bobbili yuddam natakam.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాంకము.

స్థలకము: - కోటిలింగ రాజమహేంద్రవరముల నడుమ.

[విజయరామరాజు సచివసామంతాది మహాపరివారముతో

యథానిర్దిష్టము ప్రవేశించును]

రాజు. - [స్వగతము] ఈమాఱు నాకు విజయము కలిగి నావిజయరామ నామము సార్థము కావలయును.

హర్కారాలు. - [రాజునెదుటికి చొచ్చి] ఏలినవారి హర్కారాలముమేము? మామొఱ్ఱ ఆలకించరేమి మహాప్రభో మాయేలినవాడా! ఆలాంటిచెంపపెట్లు (ఇత్యాది.)

రాజు. - [కని విని,] అప్పన్నా, ఏమి ఆదిలోనే యీ యపశకునము. ఎవరువీరు?

అప్పన్న:- [జనాంతికము] మహా ప్రభూ, వీరు ఏలినవారి యానతిచేత [తన్ను నిర్దేశించుకొనుచు] ఈనౌకరుచేత తయ్యారయిన మనవేగులు. ఇటనుండి బొబ్బిలికి ప్రకాశముగా హర్కారాలుగా తరలి, విజయనగరము దాఁటఁగానే వేగులుగామాఱి, అచటి వృత్తాంత మెల్లం గని, మరల హర్కారాలుగా, ఇట మాఱి, ప్రవేశించినారు. వీరు బుస్సీయెదుట రాయనిమీఁది మన ప్రయోగమునకు మిక్కిలి సాధనభూతు లగువారు.

రాజు. - [జనాంతికము] బళి బళీ! అప్పన్నా? నీవోయి మమ్ముఁ గొలువ నేర్చినవాఁడవు ! మంచిది, వీరియొద్దికం గనియెదఁగాక. [ప్రకాశము] ఎవరురా మీరు? ఏల మామ్రోల నిట్లు మొఱ యిడెదరు?

హర్కారాలు. - మహాప్రభూ, మేము ఏలినవారి జాబులు బొబ్బిలికి రంగారాయనింగారికి తీసుకొవెళ్లిన హర్కారాలమండి. మమ్మల్ని అక్కడ తన్ని చెంపకాయలు కొట్టి వెనకకి తగిలేసినారండి.

[రాజును అప్పన్నయు మొగమొగంబులు సూతురు.]

రాజు. - [హర్కారాల నుద్దేశించి] ఏమిరా, మీరు జాబు వారికి ఇచ్చినారా లేదా?

హర్కా. - ఏలినవారిజాబు లని చెప్పఁగానే, వారి తమ్ములు వెంగళరావుగారు పెరుక్కొని చింపి పారేశి మమ్మల్ని నోరు తెరవనీక పీక పట్టుకొని తన్ని చెంపలు వాయించి తగిలేశినారు మహాప్రభో. - "ఆలాంటిచెంపకాయలు" ఇత్యాది.