పుట:Bobbili yuddam natakam.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాంకము. 103

బుస్సీ. - మహాప్రభూ; ఈదాదియే తన చేతినుండి యీబాలుని హరింపవచ్చిన వారిని మన సిపాయీలను నూఱుగురను పరిమార్చినది.

నైజాము, సభ్యులు. - బలారే ! బలారే ! ఏమి వీరభూమి ఆగడ్డ !

నైజాము. - లే దాదీ. లే. నిన్ను మెచ్చినారము.

వేంకట. - ధర్మరక్షకుని కటాక్షము. [అని లేచి నిలుచును.]

నైజాము. - దివాన్ బహద్దర్ టో,గ్రాలీగారూ - కుమారునికి సర్వము యథోచితము జరుపునట్లుగా ఇపుడు ఉత్తర సర్కారులకు దొరలైన యింగ్లీషువారి గవర్నరుగా మదరాసురాజధానిలో నేలుచుండు దొరగారికి మాసిఫారసును జాబువ్రాయుఁడు. ఆ జాబును ప్రత్యేకముగా రవానాచేయుఁడు. దానినకలును వీరికిపుడు మేమిచ్చిన ఫర్మా నాగా మాసికామొహరులనుం బొందించి, సవారిలో ఉంచి దానిని, ఇంక ఈచిన రాజావారికి మేమిచ్చినవిగా అనర్ఘ్యములైన మహారాజోచిత దివ్యభూషణములను ఒకకత్తలాని తేజీని, ఢంకాను, మేళతాళములతోఁగూడ వారి సవారివెంటగొనిపోయి వారిబసలో చేర్పుఁడు. నీలాద్రిరాయనింగారిని మాగొప్పసర్దారులకుందగిన మరియాదలతో సత్కరింపుడు. బాలుని గాచుటచేత మాకు గొప్పమేహనత్తు గావించినప్రభుభక్త శేఖరమణి వేంకటలక్ష్మి చేతికి నవరత్న ఖచితమయినజాలువాపసిఁడితోడా తొడుగుఁడు.


టో,గ్రాలి. - [లేచి] సర్కారాజ్ఞ. [అని కూర్చుండును.]

నైజా. - హసేనాలీ, నీవు వీరితోఁ గూడఁ బోయి, మాఫర్మాన్ బొబ్బిలిలోను, విజయనగరములోను, ప్రకటించి, ఈరాజావారిని బొబ్బిలిజమీనులో కుదురు పఱిచి రమ్ము.

హసేనాలీ. - (లేచి) సర్కార్ ఆజ్ఞ. [అని కూర్చుండును.]

నీలాద్రి, దాది. - మహాప్రసాదము, మహాప్రసాదము.

నీలాద్రి. - బాబూ, 'మహాప్రసాదము' అని చెప్పుము.

బాలు. - మహాప్లసాదము.

[నౌకర్లు పళ్లెములో రత్నాల కటారి పన్నీటి కూజాయును తెచ్చి నైజాముకడ నిలుతురు.]

నైజాము. - కుమారా, చినవేంకటరాయా, ఇటు రమ్ము.

[బాలుఁడు పోయి మోఁకరించి నిలుచును.]

నైజాము. - ఇది మేము మాచేతితో నీ కిచ్చిన యినాము. (అని కటారీఇచ్చి, పన్నీరు చల్లి) పోయి కూర్చుండుము.