పుట:Bobbili yuddam natakam.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దశమాంకము.

స్థలకము: - గోలకొండ నైజాము దర్బారు.

[నైజాము, వజీరు, బుస్సీదొర, హసేనాలీ, పరివారంబుబు యథోచితము ప్రవేశింతురు.]

నైజాము. - నిన్న హైదరును శిక్షించిన యాగ్రహములో అడుగ నైతిని. . హసేనాలీ, ఇందఱు సర్దారులు గతించిన యీ రణములో, నీవెట్లు బ్రదికి వచ్చితివి ?

హసే. - మహాప్రభూ, నేను రాయనివారి పక్షముగా వాదించినందున నన్ను యుద్ధము చేయ నీక హైదర్జంగు నిలిపినాఁడు.

ప్రతీహారి. - [ప్రవేశించి] బందగానే ఆలీ ; నిన్ననే తెలుపుడు చేసుకొన్న వారు బొబ్బిలిరాజాగారి కుమారుణ్ని తోడ్కొని నీలాద్రిరావుగారూ దాదీ వచ్చి వున్నారు.

నైజాము. - ఓహో ! సమయానకువచ్చినారు. తత్క్షణమే తోడ్కొనిరా?

ప్రతీ. - [నిష్క్రమించి తోడ్కొని వచ్చి] వారే గోలకొండపాదుషాగారు. ఖూర్నీషు సలాములు చేయండి. [అని నిష్క్రమించును.]

[మువ్వురు మోకాలిమీఁద నిలుతురు.]

నీలాద్రి. - బందగానే ఆలీ, మీగులామను, సామర్లకోట నీలాద్రిరాయఁడను సలాము చేయుచున్నాను. [అని సలాము చేసి, చేతులు జోడించుకొని బాలుంగూర్చి] బాబూ నీవు చెప్పు. - "నేను పాదుషాగారి గులామను, బొబ్బిలి రంగారాయనింగారి కుమారుఁడను, చినవేంకటరాయఁడను. సలాం చేయుచున్నాను" అని.

బాలుఁడు. - నేను పాదుసాగారి గులామను, బొబ్బిలి రంగారాయనివారి కుమాలుదను, చినవేంకటలాయదను, తలాము చేస్తున్నాను.

నీలాద్రి. - బాబూ ; ఇట్లు సలాము చేయుము. [అని నేర్పును.]

[బాలుడు సలాము చేసి చేతులు జోడించుకొని యుండును.]

దాది. - నేను రంగారాయనివారి జనానా దాసిని, ఈ చిన్న బాబుగారి చిన్న దాదిని, వేంకటలక్ష్మిని. [అని సలాము చేసి చేతులు జోడించుకొని యుండును.]