పుట:Bobbili yuddam natakam.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము. 97

జమీనుల నేలుచున్న, నాపగ తీఱును. [వెడవెడ అట్టహాసము చేసి] సరిసరి ! ఏల యీ కానితలంపు ? మఱి కడుపులోని యీ యాందోళనము తీఱు టెట్లు ? ఆ! జ్ఞప్తి యైనది ! ఆ హైదరుగాని చిత్రవధచేత తీఱును. ఈ నడిమిడేరా వాని దఁట. దాని మీఁదనే పోయిపడుదునా? [పరికించుట నభినయించి] ఏల? పరంగిదండు తురకదండును నావైపే వచ్చుచున్నవి ? ఇవి బుస్సీహైదర్ల దండులు గావలయు. ఈరాణువలు నన్ను గుఱిపెట్ట వేమి ? ఆ! తెలిసినది. నావెనుకనుండు తమ స్నేహితునకు రాజునకు వాని దండునకు తగులు నని కావలయు. మఱి యిది నన్ను పట్టుకొన యత్నమా? సాము లగువులు లేవా? ఆహాహా! దండ్లా నాపైకి !


                దండు దండు లటంచు గుండె తల్లడ మేల ?
                కొండంత వామికిఁ గొఱకచ్చు చాలు.
                కట్టెమో పులరాశి గగనంబు ముట్టనీ,
                చిట్టి ని ప్పుక కాల్చి సివమాడుఁ బైని.
                ముక్కంటి నిటలాన మొల కెత్తు మంటకు
                నెక్కువా యేమి యేడేడు లోకాలు? ౮౨

[దండు ప్రవేశించును. పాపయ్యవైపు నడుచును.]

పాపయ్య. - ఆహా ! ఇన్నాళ్లకు నాచేతికి ఆటిన యడవినఱకుఁడు దొరకినది. రండోయి మొనగాండ్రారా, రండి. [ప్రేవుహారములం జూపుచు] తాండ్ర పాపయ్య నయ్యా! మాస్నేహితుఁడు విజయరాముఁడు ఈ మా హారములను దొంగిలించి తమాషాకు తన కడుపులో దాఁచుకొన్నాఁడు ; వీనిని నేను గైకొని తమాషాకే ఆతనిని రాజదండనం బొందు మని యమధర్మరాజుకడకు పంపితిని. రండు మీరును పోయి ఆతమాషా చూతురుగాని.

సిపాయీ లందఱు. - [ఒకరికొకరు] తాండ్రపాపయ్య! పాపయ్య రాజునుచం పొచ్చి ఆవేస మాడుతున్నాడు. మనము రాజుమీదికి వస్తే ఇక్కడ మఱి కోలాగైంది.

[పాపయ్య వారింగూర్చి 'కిల్లల్లల్లల్లా, అని యార్చి, బాహాస్ఫోటనము సేయును. వారు వెఱచఱచుట నభినయించి వెనుకకు విఱుగుదురు.]

పాపయ్య. - అయినదా మీపని ? సముద్రమును చూడఁగానే మీగుండెబ్రద్దలైనది. అడ్డు ఈఁదఁదెగఁబడువాఁ డెవఁడు ? దావాగ్నిం జూడఁగానే లేళ్లు పాఱి పోయినవి, దానిని దాఁటిపోవున దేది! పొండి! పిడికెఁడుకూటికై దేహ మమ్ముకొన్న కక్కూరితిగాండ్రు మీరు. మీ పెండ్లాముబిడ్డల యుసురు నాకేల ? మిమ్ము విడిచి