పుట:Bibllo Streelu new cropped.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44. తబిత - అచ.9.36-41

పేతురు గ్రీకు నామం. కేఫా హీబ్రూ నామం. పౌలు గ్రీకు నామం. సౌలు హీబ్రూ పేరు. అలాగే తబిత హీబ్రూ నామం. డోరాస్ గ్రీకుపేరు. ఈ పేరుకీ చిన్నజాతి జింక అని అర్థం. జింక సౌందర్యానికి పెట్టింది పేరు. కనుక కొందరు స్త్రీలు ఆ పేరు పెట్టుకొనేవాళ్లు.

యొప్పా ఓడరేవు. సమరియా రాష్ట్రంలో వుంది. పూర్వం ఫిలిప్ప ఇక్కడ వేదబోధ చేసి జ్ఞానస్నానాలిచ్చాడు -8,5-13. బైబులు తబితను "శిష్యురాలు" అని పిలిఉస్తుంది. సువిశేషాలు ఈ పదాన్ని పండ్రెండుమంది శిష్యులకి oos” క్రీస్తుతో సంబంధం కలవాళ్లకీ మాత్రమే వాడతాయి. కనుక తబిత పేరుమోసిన భక్తురాలై వుండాలి. ఇక్కడ తబిత పేదసాదలకు చేసిన సత్కార్యాలకు గాను లూకా ఈమెను శిష్యురాలు అన్నాడు. తబిత పేదల్లో దేవుణ్ణి చూచి వారికి అన్నం పెట్టింది. బట్టలు కుట్టి పెట్టింది. “మీరు నాకు ఆకలి గొన్నపుడు అన్నం పెట్టారు, బట్టలు లేనపుడు బట్టలిచ్చారు" అన్న ప్రభువు వాక్యాన్ని అక్షరాల పాటించింది -మత్త 25,35-36. “క్రియలు లేని విశ్వాసం నిర్జీవమైంది" అనే యాకోబు వాక్యాన్ని తనచేతల ద్వారా రుజువు చేసింది - యాకో 2,17.

తబిత మరణించినపుడు భక్తులు లిద్దాలోవున్న పేతురుని పిలిపింపగా అతడు యొప్పాకు వచ్చాడు. ఆమె మృతదేహమున్న గదిలోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే తబిత శవంచుటూ మూగివున్న వితంతువులు మొదలైన పేదరాళ్లకు దుఃఖం పొరలి వచ్చింది. వాళ్లు పూర్వం తబిత తమకు కుట్టియిచ్చిన బట్టలను పేతురుకి చూపించి బిగ్గరగా ఏడ్చారు. ఆమె పూర్వం తమకు ఎంతగానో సాయం చేసిందని చెప్పకొన్నారు. ఆమె నిజంగా అనాథులను విధవలను ఆదరించిన దైవ భక్తురాలు -యాకో 1.27. ఆరోజుల్లో ఇంకా కుట్టుయంత్రాలు లేవు. కనుక తబిత తన సొంత చేతులతోనే ఎంతోమంది పేద వితంతువులకు బట్టలు కుట్టిపెట్టి వుండాలి. కనుక వాళ్లంతా కృతజ్ఞతా పూర్వకంగా ఆమె మృతికి సంతాపించారు.