పుట:Bible Sametalu 2.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దోచుకొని,కొట్టి, కొనప్రాణాలతో విడిచిపెట్టి పోయారు. అతడు చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఆ సమయంలో ఒక యాజకుడు (పూజారి), మరొక లేవీయుడు(దేవుని సేవకు నియమించబడినవాడు) ఆ దారివెంటనే వెళుతూ, దొంగల చేతిలో దెబ్బలు తిని ఆపదలో ఉన్నవాణ్ణి చూస్తూ, ఉదాసీనంగా వెళ్ళిపోయారు. తరువాత ఒక సమరయుడు (తక్కువ వానిగా చూడబడేవాడు) ఆ దారిన పోతూ, ఆపదలో ఉన్న ఆ బాటసారిని చూచి జాలిపడి, అతనికి ప్రధమ చికిత్సచేసి ఆదరించి బాగు చేయగల ఒక గృహానికి చేర్చాడు. నిజానికి దొంగల చేతిలో చిక్కిన బాటసారికి స్నేహితుడు, లేక పొరుగువాడు ఆ సమరయుడేనని ధర్మశాస్త్రోపదేశకుడు ఒప్పుకున్నాడు. ప్రతివాడూ తన స్నేహితుని కోసం ప్రాణమును సైతం అర్పించాలని బైబులు ప్రబోధిస్తుంది. కనుక ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము అనే తెలుగు సామెత, స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడనే బైబులు సామెత ఒకే భావాన్ని భోధిస్తున్నాయి. 2 తెలుగుసామెత: కలసిరాని కాలంలో కలిసొచ్చేవాడే స్నేహితుడు బైబులు సామెత: సంపదలలో మంచి మిత్రుని గుర్తింపజాలము. కాని ఆపదలలో చెడ్డ స్నేహితుని తప్పక గురింపవచ్చును (సీరా 12:8) ఒక వస్తువు పదికాలాల పాటు మన్నుతుందో లేదో తెలుసుకొనేందుకు దానిని వివిధ పరీక్షలకు గురిచేస్తారు. మనిషి మంచితనాన్ని, నాణ్యతను గుర్తించడానికి కూడా కొన్ని పరీక్షలుంటాయి.దేవుడు అనేకసార్లు తన భక్తులను పరీక్షిస్తుంటాడు. మన స్నేహితుడని చెప్పుకొంటున్న వాడు నిజంగా స్నేహితుడో కాదో నిర్ణయించేది కాల పరీక్షే. ఏ అవసరమూ రాకుంటే అందరూ ఉత్తములే. ఎవరెలాటివారో తెలిసేది కష్టమొచ్చినప్పుడే. తుఫాను రానంత కాలం అన్ని కట్టడాలూ బాగానే ఉంటాయి. పెనుగాలి, వరదలే నిర్మాణం దార్ధ్యాన్ని బయటపెట్టేది. ఆపద వచ్చినప్పుడు ముఖం చాటువేసే మిత్రుడు హీనుడు. అతని అసలు రంగు బయటపడేది అప్పుడే. వీరు మొరమెచ్చులతో నోటి మాటలతో మురిపిస్తారు. అలా కాకుండా ప్రమాదం ముంచు కొచ్చినప్పుడు నిలబడిన వారే నిజమైన మిత్రులు. ఈ సత్యాన్నే పై తెలుగు, బైబులు సామెతలు ప్రతిపాదిస్తున్నాయి.