పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాని కాంతి యేనాడూ తరగిపోదు కనుక
 వెల్తురుకంటెగూడ దాన్ని అధికంగా అభిలషించాను
జ్ఞానం నా చెంతకు వచ్చినపుడు
సమస్త ప్రశస్త వస్తువులనుకూడ తీసుకవచ్చింది -సొలో జ్ఞాన 7,8-11

అది మనకు దీర్ఘాయువునీ ఆనందాన్నీ సంపదలనూ దయచేస్తుంది.
 విజ్ఞానం కుడిచేత దీర్ఘాయువుంటుంది
ఎడమచేత సంపదలూ కీర్తీ వుంటాయి
 అది నీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది
 నీ మనుగడకు సంతృప్తినిస్తుంది
 విజ్ఞానం తన్ను స్వీకరించేవారికి జీవవృక్షమౌతుంది?
 దాన్ని పొందేవాళ్లు సంతోషంతో జీవిస్తారు- సామె 3,16-18

దానివలన మనకు భద్రత కలుగుతుంది. అది మనలను ఉపద్రవాలనుండి కాపాడుతుంది

 కుమారా! నీవు విజ్ఞానవివేకాలను అలవర్చుకో
 వానిని ఏనాడూ అశ్రద్ధ చేయకు
 అవి నీకు జీవాన్నిస్తాయి
 నీ కంఠానికి అలంకార మౌతాయి
 విజ్ఞానవివేకాలతో నీవు సురక్షితంగా నడుస్తావు
 నీ యడుగులు ఎచ్చటా తడబడవు
 నీవు శయనించేపుడు భయపడక నిశ్చింతగా నిద్రపోతావు
 దుర్మారులకులాగా నీకు అకస్మాత్తుగా
 ఏమి ఉపద్రవాలు వస్తాయో అని భయపడవు
 నిన్ను కాపాడేవాడు ప్రభువు కనుక
 అతడు నిన్నే బంధాల్లోను చిక్కుకోనీయడు - 3, 21–26

దానివల్ల మనకు సకల భాగ్యాలూ, న్యాయమూ సిద్ధిస్తాయి.
 నా యొద్ద భోగభాగ్యాలు కీర్తిప్రతిష్టలు
అక్షయ సంపదలు నీతిన్యాయాలు వున్నాయి
 మేలిమి బంగారంకంటె, మెరుగైన వెండికంటె
 నే నొసగే ఫలాలు మిన్నయైనవి
 నేను ధర్మపథాన నడుస్తాను
 న్యాయమార్గాన సంచరిస్తాను - సామె 8,8-20