పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు నభోమండలాన్ని నిర్మించినపుడు
కడలికి చెలియలికట్టను చుట్టినపుడు
నేను ప్రధాన శిల్పివలె అతని చెంత నిల్చివున్నాను
పసికందులాగ రోజురోజు అతనికి ఆనందం చేకూరుస్తూ
నిత్యం అతని సన్నిధిలో ఆటలాడుకొనేదాన్ని
అతడు చేసిన పుడమిమీద క్రీడిస్తూ
ప్రమోదంతో మానవాళిమధ్య వసిస్తూండేదాన్ని - సామె 8, 30-31

నిర్మలమైన ప్రేమకి దైవభీతికీ విజ్ఞానం జనని. యిప్రాయేలీయులు విజ్ఞానవృక్షఫలాలు భుజిస్తారు. విజ్ఞానం వారి మధ్యనే వసిస్తుంది.

నిర్మలమైన ప్రేమకీ దైవభీతికీ
విజ్ఞానానికీ నిరీక్షణకూ నేను జననిని
నేను శాశ్వతంగా మనేదాన్ని కనుక
దేవుడు తానెన్నుకొనిన ప్రజలందరికీ నన్ను దయచేసాడు
నన్నభిలషించేవాళ్ళంతా నా చెంతకు రండి
మీ యాకలితీర నా ఫలాలను భుజించండి - సీరా 24, 18-19

అపుడు సర్వాన్ని చేసిన దేవుడు నాకాజ్ఞ యిచ్చాడు
సృష్టికర్త నేనెచట వసించాలో నిర్ణయించాడు
అతడు నీవు యాకోబు వంశజుల నడుమ వసించు
యిస్రాయేలీయులు నీ ప్రజలౌతారని చెప్పాడు
పవిత్రమైన గుడారంలో నేను ప్రభువుని సేవించాను
అటుతర్వాత సియోను కొండమీద వసించాను
ప్రభువు తనకు ప్రీతికరమైన నగరాన
నాకు నివాసమేర్పరచాడు
యెరూషలేముమీద నాకు ఆధిపత్యం ఒసగాడు
అతడు తన సొంత ప్రజనుగా ఎన్నుకొని
ఆదరాభిమానాలతో చూచుకొనే జనుల నడుమ నేను స్థిరపడ్డాను - సీరా 24, 8-12

ఈ జ్ఞానమూ ప్రభువు ధర్మశాస్త్రమూ ఒకటే. మోషే ధర్మశాస్త్రమే జ్ఞానం అనడం పూర్వవేదంలో చాలా గొప్ప భావం.