పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆధ్యాత్మిక పద్ధతిలో నేర్పుతాయి. అన్నిటినీ దేవునితో ముడిపెడతాయి. ప్రభువుపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటిమెట్టు అని చెప్తాయి - సీరా 1, 14 సామె 1,7, ఎప్పడూ వరప్రసాదం విజ్ఞానం కలసిపోతాయి. వరప్రసాదాన్నికోల్పోయిన నరుళ్ళో విజ్ఞానం నిలువదు. దానికీ పాపులకూ చాల దూరం.

బైబులు విజ్ఞానాన్ని వివేకం, వివేచనం, గ్రహణశక్తి, సలహాను చేకోనడం అనికూడ పిలుస్తుంటుంది. ఆ విజ్ఞాన గుణానికి భిన్నమైంది పాపం, బుద్ధిహీనత, అజ్ఞానం, మూర్ఖత్వం, అహంకారం, దుష్టత్వం, అవహేళనం. ఈ పదాలను బట్టికూడ విజ్ఞాన స్వభావాన్ని కొంతవరకు గ్రహించవచ్చు.

ఈ విజ్ఞాన గ్రంధాలు ధర్మశాస్త్రం, నిబంధనం, ఎన్నిక, విముక్తి, దైవారాధనం మొదలైన పూర్వవేదంలోని ప్రధానాంశాలను ప్రస్తావించవు. కనుక యూదులు ఆదిపంచకానికీ, ప్రవక్తల గ్రంథాలకూ ఇచ్చిన విలువను ఈ పుస్తకాలకు ఈయలేదు. విజ్ఞానం ప్రధానంగా బాబిలోనియా ప్రవాసానంతరం (587) వృద్ధిలోకి వచ్చింది. మామూలుగా ఈ పుస్తకాలు వ్యక్తి బాగోగులనే కాని సమాజం బాగోగులను పట్టించుకోవు. ఐనా వీటి విలువను తక్కువగా అంచనా వేయకూడదు.

5. జానులు

ఈ గ్రంథాలను చెప్పిన జ్ఞానులు తాత్వికులు, మానవతావాదులు. యాజకులు ధర్మశాస్త్రాన్ని బోధించి దేవాలయంలో ఆరాధనను నిర్వహించేవాళ్లు ప్రవక్తలు దైవసందేశాన్ని తెలియజెప్పేవాళ్ళు జ్ఞానులు కేవలం ఉపాధ్యాయులు. వాళ్లు తరతరాల మానవ జీవితాన్ని గూర్చిన తమ అనుభవాన్నీ విజ్ఞానాన్నీ మనకు అందించిపోయారు. కాని వారి బోధలు కేవలం లౌకికమైనవికావు, భగవత్ర్పేరితమైనవి. కావుననే వారి గ్రంథాలకు బైబుల్లో చోటు లభించింది. విజ్ఞాన బోధకుడైన ಜ್ಞಾನಿನಿ సీరా గ్రంథం 39, 1-11 చక్కగా వర్ణిస్తుంది.

విజ్ఞాన గ్రంథాల్లో మూడు ప్రధానాంశాలు కన్పిస్తాయి. 1. జ్ఞానులు తమ బోధలను సామెతలు సూక్తులు నీతివాక్యాల రూపంలో వెలయించారు. 2. వారి బోధల్లో దైవ ప్రేరణమూ కన్పిస్తుంది, సొంత ఆలోచనలూ అనుభవాలు కూడ కన్పిస్తాయి. కనుక ఈ గ్రంథాలను అన్య మతస్తులుకూడ పరించి లాభం పొందవచ్చు. చాల తావుల్లో వీళ్ళ బోధలు మన దేశంలో వెలసిన పంచతంత్రం, హితోపదేశం, నీతిశాస్త్రాలు, నీతిశతకాలు మొదలైన పుస్తకాల స్థాయిలో వుంటాయి. ఇవి లౌకిక బోధలు మాత్రమే. 3. మతం ఓ సిద్ధాంతం మాత్రమే కాదు, ఆచరణం కూడ. కనుక ఈ పుస్తకాలు మతాచరణనుగూర్చీ సత్ర్పవర్తనను గూర్చీ మాటిమాటికీ నొక్కి చెప్తాయి. అసలు ఈ గ్రంథాల్లో 75 శాతం నైతిక బోధలే వుంటాయి.