పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియమాత విషయంలో క్యాథలిక్ క్రైస్తవులకీ ప్రోటస్టెంటు క్రైస్తవులకీ ప్రధానభేదం యిది. ముందటి అధ్యాయాల్లో చెప్పినట్లు క్యాథలిక్ క్రైస్తవులు ఆమె మన రక్షణంలో పాల్గొంది అంటారు. ఆమెను "రక్షణమాత" "సహరక్షకి" "మధ్యవర్తిని” అనే పేర్లతో పిలుస్తారు. కాని ప్రోటస్టెంటు క్రైస్తవులు ఈ విషయాన్ని అంగీకరించరు. వీళ్ళభావాల ప్రకారం మరియకూడ ఇతర శిష్యుల్లాంటిదే. వాళ్ళలాగ ప్రభుకరుణ స్వీకరించేదే. ఆమె ప్రభురక్షణానికి పాత్రురాలైంది అంతే. మరియ మన రక్షణంలో పాల్గొంది అంటే క్రీస్తు రక్షణం నాశమైపోతుంది. అతడు మనకు మధ్యవర్తి కాకుండాపోతాడు. కనుక మరియ క్రీస్తుతో కలసి మనలను రక్షించింది అనకూడదు. క్రీస్తుతో పనిచేసింది అనాలి. ఆమె క్రీస్తుచెంత నిలచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండిపోయిందిగాని, తాను స్వయంగా మధ్యవర్తిని కాలేదు.

కాని క్యాథలిక్ క్రైస్తవులు దీనినంగీకరింపరు. వాళ్ళ ప్రకారం యథార్థ మధ్యవర్తియేమో క్రీస్తే. కాని యీ మధ్యవర్తి మానవ మధ్యవర్తులనుగూడ తనతో జోడించుకొనే తన మధ్యవర్తిత్వాన్ని నెరపాడు. నరుని నరుడే రక్షించుకోవాలి అని దేవుని ఆశయం. కనుకనే దేవుడు నరుడై జన్మించింది. ఈలా నరుడైన దేవునితో మరియకూడ కలసిపోతుంది. దేవుని మధ్యవర్తిత్వం నరుల మధ్యవర్తిత్వాన్ని నిరాకరించదు. కరుణతో తనతోగూడ చేర్చుకుంటుంది. ఈలా చేర్చుకోవడం అవసరమైకాదు, ఔచిత్యం కోసం. కనుక మరియ క్రీస్తు చెంత నిలిచి అతని మధ్యవర్తిత్వానికి సాక్ష్యంగా వుండిపోవటం మాత్రమేగాదు, తాను స్వయంగా మన మధ్యవర్తినిగూడ.

ప్రోటస్టెంటు నాయకులు మొదటిరోజుల్లో మరియు మాతనుగూర్చి చాల విషయాలు అంగీకరించారు. లూథరుకి ఆమెపట్ల చాల భక్తి అభిమానమూ వుండేవి. కాని క్రమేణ ప్రోటస్టెంటు శాఖలు "బైబులుమాత్రమే, దేవుడుమాత్రమే, వరప్రసాదం మాత్రమే" అనే వాదాన్ని లేవదీసారు. ఈ వాదం ప్రకారం బైబులులోలేని క్రైస్తవమత ఆధారాలన్నీ పోయాయి. కనుక పారంపర్యబోధ పోయింది. దేవుడుగాని పునీతులంతాపోయారు. వాళ్ళతోబాటు మరియమాత కూడ పోయింది. వరప్రసాదం కానిదంతా పోయింది. అనగా నరుల సహకారంగూడ పోయింది. ప్రోటస్టెంటులు మరియమాతను తూలనాడ్డం మొదలెట్టారు. అది చూచి క్యాథలిక్కులు ఆమెను అత్యధికంగా స్తుతించడం మొదలెట్టారు. ప్రోటస్టెంటులు ఆమెను పూజించడానికి ఆస్కారమేమిటి అన్నారు. క్యాథలిక్కులు పారపంర్యబోధ అన్నారు. ప్రోటస్టెంటులు ఆమెను కొనియాడితే క్రీస్తు మధ్యవర్తిత్వం పోతుంది అన్నారు. క్యాథలిక్కులు పోదు, ఇంకా అర్థవంతమౌతుంది అన్నారు. ఈలా నిన్నమొన్నటివరకూ ఈ ఉభయశాఖలవాళ్ళూ పోట్లాడుకొంటూనే వచ్చారు.