పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించి పెడుతుంది. మన తరఫున క్రీస్తును మనవి చేస్తుంటుంది. ఆ ప్రభువు మళ్ళా రెండవమారు విజయం జేయకముందు విశ్వాసులంతా ఆమెపట్ల భక్తి చూపుతారని చాలమంది పునీతులు అభిప్రాయపడ్డారు.

దేవుడే ఆమెను ఎన్నుకొని మన రక్షణమాతనుగా నియమించాడు. కనుక మనమూ ఆమెను ఎన్నుకొని గౌరవించాలి. ప్రభువు ఆమెద్వారా మనచెంతకు వచ్చాడు. మనమూ ఆమెద్వారాగాని తన్ను జేరలేమని నేర్పాడు . అంచేత మనం ఆ తల్లిపట్ల భక్తి చూపుతూండాలి.

క్రైస్తవ ప్రజలు మరియమాతపట్ల చూపే భక్తి క్రియలు చాలావున్నాయి. ఆమె పండుగలు చేసికొనవచ్చు. నిష్కళంకోద్భవమూ, ఉత్థాపనమూ ఈ పండుగల్లో ముఖ్యమైనవి. శనివారాలను భక్తిపూర్వకంగా ఆమెకు సమర్పించవచ్చు.

మనలనూ మన రోజువారి పనులనూ ఆ తల్లికీ ఆమె ద్వారా క్రీస్తుకీ అర్పించుకోవచ్చు. పాపం కట్టుకోకుండా వుండేలా సాయపడమని ఆ తల్లిని అడుగుకోవచ్చు.

మరియమాత ఉత్తరీయం ఒకటుంది. 1251లో ఆమె సైమన్ స్టోక్ అనే ఆంగ్లభక్తునికి దర్శనమిచ్చి తన ఉత్తరీయాన్ని ధరించేవాళ్ళు నరకానికి పోరని మాటయిచ్చింది. ఈ యుత్తరీయంతోపాటు ఆమె స్వరూపాలు ధరించడమూ, ఆమె చిత్రాలూ ప్రతిమలూ ఇండ్లల్లో పెట్టుకొని పూజించడమూ సనాతన క్రైస్తవాచారం. మరియమాత ప్రతిమకు చూపిన గౌరవం ఆ బొమ్మకు గాదు, మరియకు చెందుతుంది. గతించి పోయిన మన తాతగారి ఫోటోకు చూపిన గౌరవం ఆయనకే చెందుతుంది గదా!

మరియను గౌరవించే సభలు కొన్ని వున్నాయి. సొడాలిటీ, లీజను వీటిల్లో ముఖ్యమైనవి. ఈ సభల్లో చేరి ఆ తల్లిని నుతించవచ్చు.

మరియమాత పేర చెప్పే జపాలూ చాలా వున్నాయి. మరియు నామం, దేవవరప్రసాద జపం, త్రికాలజపం, నవీనా జపాలూ, దేవమాత ప్రార్థన, కృపారస మంత్రం, మిక్కిలి నెనరుగల తల్లి అనే జపం, జపమాల, దేవమాత ఆఫీసు, దేవమాత కీర్తనలు మొదలైనవి భక్తిరసభరితమైన ప్రార్థనలు.

పై జపాల్లో రెండు చాల ముఖ్యమైనవి. అవి మరియ నామం, జపమాల. మరియనామం పవిత్రనామం. ఆ నామం తన్నుచ్చరించే వాళ్ళను పవిత్రపరుస్తుంది. పిశాచాన్ని పారద్రోలి రక్షణను సంపాదించి పెడుతుంది. దేవమాత ప్రార్థనలన్నిటిలో జపమాల శ్రేష్టమైంది. క్రీస్తు మరియల జీవిత ఘట్టాలను ధ్యానం జేసికొంటూ జపమాలను చెప్పినట్లయితే చాలా ఫలితం పొందవచ్చు.

క్రీస్తు సాన్నిధ్యంలాగే మరియ సాన్నిధ్యం అనేది కూడ ఒకటుంది. భక్తులు చాలమంది ఆ తల్లి సాన్నిధ్యాన్ని స్మరించుకొన్నారు. ఆమె వాళ్ళ విశ్వాస నేత్రాలకు