పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. క్రీస్తు బహిరంగ జీవితం :

ప్రభువు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించాడు. యెరూషలేములోని మతాధికారులు క్రీస్తుకు వ్యతిరేకులయ్యారు. అతడు కూడ యూదుల విశ్రాంతి దినం,ధర్మశాస్త్ర నియమాలు మొదలైన వాటిని నిరసిస్తున్నాడు. పేదలు సుంకరులు మొదలైన అట్టడుగువర్గంవాళ్ల కోపు తీసికొంటున్నాడు. మరియ కలత చెందింది. కుమారుని భావాలు ఆలోచనలు ఆమెకు సరిగా అర్థంకాలేదు. ఐనా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. క్రీస్తు ఆదరించే పేదల పట్ల తానూ ఇష్టం పెంచుకొంది.

యేసుకి 30 ఏండ్లు. మరియ 50 ఏండ్ల వితంతువు. కానాపూరి వివాహంలో ఆమె కుమారునడిగి బంధువులకు ద్రాక్షరసం సరఫరా చేయించింది. కొందరు నరులు క్రీస్తుని ఎడబాయని అనుచరులయ్యారు. కొన్ని సార్లు ఆమె కూడ కుమారుని అనుసరించింది. యెరూషలేములోని రాజకీయ నాయకులు మతాధికారులు మాత్రం క్రీస్తును తీవ్రంగా ఎదిరిస్తున్నారు. మరియ భయపడింది. రాజకీయ ప్రాబల్యానికి వెరచింది. అధికారుల బలానికి దడిసింది. ఆమె మన మనుకొన్నట్లుగా కేవలం కోమల హృదయ, మృదుస్వభావ, మననశీల మాత్రమేకాదు. ధీరవనిత. ఆనాటి రాజకీయాల్లో ఆమెకు ప్రవేశముంది. వాటి తాకిడికి గురైంది కూడ.

8. క్రీస్తుకి తీర్పు :

మరియ క్రీస్తుకి జరిగిన తీర్పును, అతడనుభవించిన హింసలనూ కండ్లార చూచి వుంటుంది. సిలువ మార్గంలో ఆమె కుమారునికి ఎదురుపడింది. శిష్యులు ప్రభువును విడచి పారిపోయినా ఆమె అలా చేయలేదు.

9. సిలువ క్రింద :

క్రీస్తు చనిపోయేపుడు మరియ సిలువ క్రింద నిలచివుంది. కుమారుని శ్రమలు కండ్లారా చూస్తూగూడ అతనికి సహాయం చేయలేక దుఃఖించింది. విశేషంగా తన కుమారుడు అపజయం పొంది మరణించినందులకు ఎంతో బాధపడింది. ఐనా ఆమె వేదనలు మానసికమైనవే గాని శారీరకమైనవి కావు. శత్రువులు ఆమెను ఎగతాళి చేసి యేడ్పించి వుంటారు. ఆమె నిబ్బరంగా సహించి ఊరకుంది. క్రీస్తు ఆమెను యోహానుకి తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగాను అర్పించాడు. కుమారుని మరణానంతరం ఆమె వయసుమళ్లిన మహిళగా కొన్ని యేండ్ల పాటు జీవించివుంటుంది. ఆ కాలంలో ఒంటరితనం వల్ల క్రుంగిపోయి వుంటుంది.