పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. శిశువను కానుక పెట్టడం :

మరియా యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించారు. ఆ సమయంలోనే వృద్దుడైన సిమియోను వచ్చి ఈ శిశువు అనేకులపతనానికీ ఉద్ధరణానికీ కారకుడౌతాడు. ఓ ఖడ్గం నీ హృదయాన్ని గూడ దూసుకొని పోతుందని మరియతో చెప్పాడు. పూర్వరచయితలు ఇక్కడ మరియ మోషే ధర్మశాస్తానికి విధేయురాలు కావడం గొప్ప అని చెప్పారు. కాని ఆధునికులు ఇక్కడ తల్లిగా మరియ అనుభవించిన బాధలు ముఖ్యమని చెప్తున్నారు. బాధ్యత నెరిగిన వ్యక్తిగా ఆమె కుమారునితో పాటు తానూ భావికాలంలో రాబోయే శ్రమలను అనుభవించడానికి సంసిద్ధమైంది.

5. ఈజిప్టుకు పారిపోవడం :

తిరుకుటుంబం రాజకీయంగా దేశబహిష్కృతమైంది. ఇప్పడు కూడ పాలస్తీనానుండి ఈజిప్టుకు మట్టిరోడ్డువెంట ప్రయాణం చేయడం చాలకష్టం. మరియ భద్రంగా గట్టిన కాన్వెంటు గోడల మధ్య వసించలేదు. ఎండవానలకూ శీతోష్ణాలకూ గురైంది. ఆనాటి క్రూరరాజకీయాలకు చిక్కినలిగిపోయింది. మరియా యోసేపలు పూర్వపు యిప్రాయేలీయుల్లాగే కాందిశీకులుగా, పేదలుగా ఈజిప్టుకు వెళ్లారు. అక్కడ బానిస బ్రతుకులు ఈడ్చారు. ఇక్కడ బేల్లెహేములో క్రీస్తుశిశువు తప్పించుకొనిపోయాడని ఆగ్రహించి హెరోదు నిరపరాధులైన శిశువులను మట్టపెట్టించాడు. బలవంతులు దుర్భలులైన పేదలకు చేసే అన్యాయాలకు మరియ పరితపించి కన్నీరు కార్చింది.

6. దేవాలయ సందర్శనం :

క్రీస్తుకు 12 ఏండ్ల యిూడొచ్చినపుడు మరియా యోసేపులు యెరుషలేము పాస్మోత్సవానికి వెళ్లారు. ఆ సమయంలో క్రీస్తు బాలుడు నేను తండ్రి పనిలో నిమగ్నుడ్డికావద్దా అన్నాడు. ఆ మాటలు తల్లికి అర్థం కాలేదు. ఆమెకు క్రీస్తు భవిష్యత్తును గూర్చి స్పష్టంగా తెలియదు. దేవుని మీద భారంవేసి తనకు అంతుబట్టని సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది. చీకటిలో తడవుకొంటూ నడచింది. ఈ సంఘటనం తర్వాత కొన్నాళ్లకు యోసేపు చనిపోయి వుండాలి. ఇక కుటుంబం ఆలనాపాలనా అంతా ఆమె నెత్తిన పడింది. కనుక మరియను పవిత్ర కన్యనుగా కంటె కాయకష్టం చేసికొని బ్రతికిన గృహిణినిగా గణించడం మెరుగు.