పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. యువతిగా మరియ:

దేవదూత మరియకు మంగళవార్త చెప్పాడు. ఆమె గర్భం ధరించింది. కాని ఆ సంగతిని యోసేపుకి తెలియజేయడం ఎలా? యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లికాకుండానే చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక ఆమె యెంతో ఆందోళనకు గురైయుండాలి. ఆమె మంగళవార్తను గూర్చి విన్న యోసేపు కూడ ఆశ్చర్యచకితుడై యుండాలి. ఇంకా మెస్సీయా బాధలనుభవిస్తాడని మరియకు కొంతవరకైనా తెలుసు. ఆలాంటి బాధామయ సేవకునికి తను తల్లికావాలి. ఐనా ఆమె దేవదూతతో నీమాట చొప్పననే నాకు జరుగునుగాక అని ధైర్యంగా పలికింది, మరియు పిరికిది కాదు, సాహసవంతురాలు.

2. ఎలిసబేతును సందర్శించడం :

మరియ తన బంధువైన యెలిసబేతుకు పురుడుపోయడానికి పోయింది. ఈ సందర్భంలో ఆమె మహిమగీతం ఆలాపించింది. ఈ పాట బయటికి చూడ్డానికి భక్తి మంతంగానే వుంటుంది. కాని యిది గొప్ప విప్లవ గీతం. దీనిలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మత పరంగాగూడ గొప్ప విప్లవభావాలున్నాయి. ధనవంతులు దైవరాజ్యాన్ని కోల్పోతారు. అది పీడితులకు దక్కుతుంది. పవిత్రుడూ, శక్తిమంతుడూ, కరుణామయుడూ ఐన ప్రభువే దాన్ని పీడితుల పరంజేస్తాడు. దీనులు విజయాన్ని చేపడతారు. అహంకారులు మన్నుగరుస్తారు. ఈలాంటి పాటను విన్పించిన వ్యక్తి గుండెల్లో ఎన్ని తిరుగుబాటు భావాలున్నాయో ఊహించవచ్చు మరియ మన మనుకొన్నట్లుగా వట్టి తీయని తల్లీ, లోకం పోకడలెరుగని భక్తురాలూ కాదు.

3. ఎలప్రాయపు తల్లి :

నిండు చూలాలైన మరియ 90 మైళ్లు నడచి బేల్లెహేము చేరుకొంది. కనుక ఆమె మనం మామూలుగా దేవమాత చిత్రాల్లో చూచే సుకుమారి కాదు. దేహదారుఢ్యం గల మహిళ. బేత్తెహేములో ధనవంతులు మరియా యోసేపలకు ఆశ్రయం నిరాకరించారు. కనుక ఆమె వ్యధకు గురైంది. నేడు మురికి వాడల్లో నివసించే పేదవారిలాంటిదైంది. సమాజం అనాధరణకు గురైంది. జంతువులూ పామరులైన గొర్రెల కాపరులూ ఆమెకు సహచరులయ్యారు. ఈ పట్టున ప్రాచీన రచయితలు ఆమె శిశువును కన్నాక గూడ కన్యాత్వాన్నికోల్పోలేదని వ్రాసారు. వారికి ఆమె కన్యాత్వం ముఖ్యం. కాని నేటి రచయితలు ఆమె కటిక పేదల అగచాట్లకు గురైందని చెప్తున్నారు.