పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయేవా చారిత్రకంగా నిలిచిపోయారు. ఈ యిద్దరు స్త్రీలు నిర్వహించిన పాత్రలను మరచిపోలేం. ఆమె పతనాన్నీ ఈమె ఉద్ధరణాన్నీ స్మరింపక తప్పదు. ఈ స్మరణమే మరియమాత పట్ల భక్తినీ గౌరవాన్నీ కలిగిస్తుంది. ఆ తల్లి పట్ల మనం చూపే భక్తి క్రీస్తుకి అప్రియం గలిగించదు. ఆ తల్లిని గౌరవించినపుడు ఆ కుమారునే గౌరవిస్తున్నాం. ఆ తల్లిని అనాదరం చేసినపుడు ఆ కుమారునే అనాదరం చేసినట్లు.

9. ధీరనారి మరియ

క్రీస్తు తర్వాత మరియమాత అంతటి వ్యక్తిలేదు. ఆమె రక్షకుని మాత, మోక్షానికి రాజ్ఞి తిరుసభకు తల్లి. మన క్యాతలిక్ సమాజంలో స్త్రీలూ, మఠ కన్యలూ మరియను ఆదర్శంగా పెట్టుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందిచుకొంటుంటారు. కనుక మరియ ప్రాముఖ్యం అన్ని విధాల గణనీయమైంది. ప్రాచీన వేదశాస్తులు మరియను గూర్చి సంప్రదాయ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. ఆమె కోమల హృదయ. నిష్ర్కియాశీల. దేవుని వరప్రసాదాన్ని స్వీకరించడం మాత్రమే ఆమె చేసిన పని. ఇంకా ఆమె వినయవతి. దేవుని చిత్తప్రకారం జీవించిన భక్తురాలు, సహనశీల. బాధామయురాలు. విశుదురాలు, నిత్యకన్య ప్రార్థనామయి. కరుణాపూరిత. పూర్వరచయితలు మరియను చిత్రించిన తీరు ఇది.

పేదసాదలూ, విశేషంగా స్త్రీలు మరియను ఆదర్శంగా బెట్టుకొని ఓర్పుతో జీవించాలి అన్నారు. ప్రత్యేకించి కాన్వెంటు నాలుగోడలు దాటి వెలుపలికి వెళ్లకుండా సాంఘిక బాధ్యతలు ఏవీ లేకుండా జీవించే మఠకన్యలకు ఆమె ఆదర్శం అని చెప్పారు. ఆమె వినయవిధేయతలూ కన్యాత్వమూ వారికి ప్రేరణం కలిగిస్తాయి అనుకొన్నారు. సిస్టర్లు మరియకు ప్రార్థన చేసి తమ అవసరాల్లో ఆమె నుండి సహాయంపొందాలని కోరారు. మనం చిన్ననాటి నుండి మరియను గూర్చిన ఈలాంటి భావాలకు అలవాటు పడిపోయాం.

కాని నేటి క్రైస్తవవేదాంతులు మరియను ఇలా చిత్రించడంలేదు. వీరి దృష్టిలో మరియ సామాజికబాధ్యతల నెరిగినవ్యక్తి సంఘజీవి. పేదలను ఆదుకొన్నకరుణామయి. ఎన్నో సమస్యల నెదుర్కొని వాటితో నిబ్బరంగా పోరాడిన ధీరవనిత. క్రియాశీల. దేవుని చిత్తానికి కట్టుపడివున్నా తన స్వేచ్చను ఈ క్రింది విధాలుగా సద్వినియోగం చేసికొన్న ఆదర్శ మహిళ.