పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రోటస్టెంటు క్రైస్తవ సమాజాలకూ క్రైస్తవ సత్యాల విషయంలో కొన్ని భేదభావాలు గోచరిస్తాయి.

మరియమాతనుగూర్చి క్యాతలిక్ సమాజం విశ్వసించే సత్యాలన్నీ బైబుల్లో స్పష్టంగా కనిపించవు. కాని పితృపాదలు బోధల్లో వున్నాయి. ప్రోటస్టెంటు శాఖవాళ్ళు పితృపాదుల బోధలను నిరాకరించారు కనుక ఆ శాఖల్లో మరియమాతను గూర్చిన అంశాలు అడుగంటిపోయాయి.

పూర్వాధ్యాయాల్లో మరియమాతనుగూర్చి చెప్పిన అంశాలను చాలవరకు పితృపాదుల రచనల్లోనుండే స్వీకరించాం. మరియనుగూర్చి ప్రస్తావించేవ్పడు పితృపాదులంతా ఆమెను ఏవతో పోలుసూ వచ్చారు. మరియమాత స్థానం అర్థంచేసికోవాలంటే ఈ పోలికను చక్కగా అర్థంచేసికోవాలి. అంచేత ఈ యధ్యాయంలో ఈ పోలికను పరిశీలిద్దాం. ప్రస్తుతం పితృపాదుల రచనల్లో నుండి ఈ యిద్దరు ఏవల పోలికకు సంబంధించిన వాక్యాలను ఇక్కడ సంగ్రహంగా పొందుపరుస్తూన్నాం. తొలియేవ పాపంలేకుండానే జన్మించింది. కాని ఆ భాగ్యాన్ని ఆమె నిలుపుకోలేదు. రెండవయేవకూడ పాపం లేకుండా జన్మించింది. పాపంలేకుండానే జీవించిందికూడ కనుక ఆమె అవివేకవతి, ఈమె వివేకవతి.

తొలియేవ తాను మరణానికి లొంగివుండేదికాదు. ఆ భాగ్యదశలో ఆదిదంపతులకు చావంటూ లేనేలేదు. కాని తొలియేవ మూరురాలై పాపంచేసి మరణం తెచ్చిపెట్టుకుంది. ఐనా రెండవ యేవ పాపాన్ని ఎదుర్కొని నిలిచింది. మరణాన్ని జయించింది. దేహాత్మలతో మోక్షానికి వెళ్ళింది. కనుక ఆమెకంటె యిూమె ధన్యురాలు.

ఆ తొలితల్లి భౌతికంగా ఆధ్యాత్మికంగా గూడ మనకు మాతగా నియమింపబడింది. కాని యేవ ఆయాధ్యాత్మిక జీవితాన్నికోల్పోయింది. మనకూ దాన్నిఅందించలేకపోయింది. కాని యీ రెండవయేవ మాత్రం మనకు ప్రతిదినం జ్ఞానజీవితాన్ని అందిస్తూనే వుంటుంది. రోజురోజు మనకు వరప్రసాదాలు ఆర్థించి పెడుతూనే వుంటుంది. కనుక ఆ తల్లికంటె ఈ తల్లి మేలైంది. ఆమె మృతులమాత ఈమె జీవవంతులమాత.

ఆ తల్లి అవిధేయతవలన దేవుని యాజ్ఞమీరి తనకూ మనకూ చావు తెచ్చి పెట్టింది. ఈ తల్లి విధేయతవలన దేవుని యాజ్ఞకు బదురాలై తనకూ మనకూగూడ జీవం తెచ్చిపెట్టింది. ఆమె అవిధేయవతి, ఈమె విధేయవతి.

ఆ కన్య తన పాపంద్వారా మనగొంతుకు ఉరిపెట్టి పోయింది. మరోకన్య ఈ వురి విప్పింది. ఆ కన్య పాపాత్మురాలు అనబడుతుంది. ఆ తొలికన్య పాపానికి ఈ మలికన్య పరిహారం చేసింది, ఆ తొలి కన్య తప్పిదం క్షమించమని ఈ మలికన్య దేవునికి మనవిచేసింది. ఆమెకు తగిలిన శాపాన్ని ఈమె తీర్చింది. కనుక ఆమె యిూమెను తన రక్షకిగా భావిస్తుంది.

28