పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/319

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చేసినట్లే భావిస్తాడు. వాళ్ళను పట్టించుకోనప్పడు తన్ను పట్టించుకోనట్లే భావిస్తాడు - మత్త 25,40-45.

చాలమంది భగవంతుణ్ణి పూజిస్తే చాలు తోడినరుణ్ణి పట్టించుకోనక్కరలేదులే అనుకొంటారు. ఇది పొరపాటు. భగవంతుడు తరచుగా తోడినరుల్లో దర్శనమిస్తాడు. కనుక అతన్ని తోడిమానవుల్లో గుర్తిస్తుండాలి. ఆ దేవుణ్ణి ప్రేమించే హృదయంతోనే తోడి మానవులను గూడ ప్రేమించాలి.

మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వశం చేసికోవడానికి కృషిచేయాలి. తోడినరులను సేవించి ప్రేమించడానికీ కృషిచేయాలి. ఈలా చేసేవాళ్ళు ఈ లోకంలో దేవుని సృష్టిని కొనసాగించుకొని పోతూంటారు. తామూ ఆ సృష్టికర్తతో కలసి పని చేస్తూంటారు.

3. లోకకృషివల్లనే క్రైస్తవునికి రక్షణం

        ఈ లోకంలో చక్కగా కృషిచేసిన వాళ్లకి మోక్షబహుమతి లభిస్తుంది. ప్రభువు బాగా కృషిచేసిన మంచి సేవకులిద్దరినీ మెచ్చుకొని "విూరు విూ యజమానుని ఆనందంలో పాలు పంచుకొనండి" అని చెప్పాడు - మత్త 25,21-23. కాని అతడు బాగా కృషిచేయని మూడవ దాసుని శిక్షించి వెలుపలి చీకటిలోనికి త్రోయించాడు-25, 30 పిండికొలది రొట్టె, ఇక్కడ కృషిచేసినదాన్నిబట్టి రక్షణ ఫలాన్ని పొందుతాం. ఇక్కడ శ్రమపడి పనిచేయడాన్నే నూత్నవేదం దేవుని చిత్తప్రకారం జీవించడమనీ, ఆజ్ఞలను అనుసరించడమనీ, ప్రేమను పాటించడమనీ పేర్కొంటుంది.

భగవంతుడు నరునికి కృషి, సేవ, ప్రేమ, స్వాతంత్ర్యం, పావిత్ర్యం తన్ను పూర్ణ హృదయంతో ప్రేమించడం మొదలైన దొడ్డ విలువల నిచ్చాడు. మనం ఈ లోకంలో స్వయంకృషిచేసి ఈ విలువలను ఫలసిద్ధికి తీసికొనిరావాలి. వాటిని పరిపూర్ణం చేసికోవాలి. ఈ స్వయంకృషే కడన మనం ఉత్తాన క్రీస్తుని కలుసుకొనేలా చేస్తుంది. ప్రభువు దర్శనంకోసం ప్రేమతో వేచివుండేవాళ్ళ కందరికీ అతడు నీతికిరీటాన్ని బహూకరిస్తాడు -2తిమో 48. మంచి క్రైస్తవుడు నిరంతరమూ "యేసుప్రభూ రమ్మ" అనే భావంతో జీవిస్తూంటాడు - ప్రక 22,20.