పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుండి మన రక్షకుడు ప్రభువుఐన యేసుక్రీస్తు రాకకై ఆతురతతో వేచివుంటాం-ఫిలి 3,20. క్రీస్తు వేంచేసి వచ్చినపుడు మనం అతని మహిమలో పాలుపొందుతాం. అతడు మనకు నిత్యజీవాన్నీ మోక్షభాగ్యాన్నీ దయచేస్తాడు. కనుక మనం ప్రధానంగా నిరీక్షణంతో జీవిస్తాం.

పదిమంది కన్నెలు చమురుతోను దిటివీలతోను పెండ్లి కొమారుని రాకడకొరకు వేచివున్నారు - మత్త25,10. ఈ కన్నెలు భక్తి విశ్వాసాలుగల క్రైస్తవులందరికీ పోలికగా ఉంటారు. మనం ఈ లోకంలో వసిస్తున్నా ఈలోకానికి కాక పరలోకానికి చెందినవాళ్ళం. రానున్న మరో నగరం కోసం వేచివుండేవాళ్ళం - హెబ్రే 13,14. ఈ లోకంలో మనం కేవలం యాత్రికులం, దేవుడు ఆయుస్సు దయచేసిన కొలది కొంతకాలంపాటు ఇక్కడ జీవించి పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. కనుక ఈ మంటి కట్టిపెట్టుని ఉండిపోవడం, ఈ లోకమే శాశ్వత మనుకోవడం, ఈ లోక వాంఛలకు లొంగిపోవడం ఉత్తమ క్రైస్తవుని లక్షణం కాదు.

2. క్రైస్తవుడు ఈ లోకంలో కృషిచేయాలి

మనం ఈ లోకంలో కొంతకాలంపాటు మాత్రమే ఉంటాం. ఐనా ఇక్కడున్నంతకాలం ఈ ప్రపంచంలో చక్కగా కృషిచేయాలి. కొందరు భావించనట్లు ఈ జగత్తు మాయకాదు. ఇది యథార్థమైన లోకం. నరుడు ఈలోకంలో కృషి చేయాలనే దేవుని కోరిక, అతడు ఆదిమానవులను దీవించి "మిరు చాలమంది బిడ్డలను కని వృద్ధి చెందండి. భూమండల మంతటా నివసించి దానిని వశం చేసికొనండి" అని చెప్పాడు - ఆది 1,28. కనుక ఈ విశ్వాన్నీ దానిలో దాగివున్న శక్తులనూ వశం జేసికోవడానికి నరులు నిరంతరమూ కృషిచేయాలి. ఇది పాపపులోకమైనా దేవుని కుమారుడు దీన్ని రక్షించాడు. అతడు దీనిలో నెలకొని ఉంటాడు.

ఈ లోకంలో మన కృషి స్వార్థరూపంలో ఉండకూడదు. ప్రేమ సేవలరూపంలో ఉండాలి. కేవలం మనకొరకు మనం జీవిస్తే ప్రయోజనంలేదు. పదిమంది మేలుకొరకు జీవించాలి. ప్రభువు ఈలోకంలోని పేదసాదల్లో బాధామయ జీవుల్లో తానూ బాధలనుభవిస్తూంటాడు. కనుకనే ఇక్కడ అత్యల్పులైన వారికి చేసిన ఉపకారాన్ని తనకు