పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“చంపేవాడు ప్రాణమిచ్చేవాడు ప్రభువే
పాతాళానికి గొనిపోయేవాడు

పైకి గొనివచ్చేవాడూ అతడే" అంటుంది - 2,6. కీర్తనకారులకు ఉత్థానాన్ని గూర్చి నిక్కచ్చిగా తెలియకపోయినా అస్పష్టంగానైన తెలుసు. కనుకనే

నీ ఉపదేశంతో నీవు నన్ను నడిపిస్తావు
కడన నన్ను నీ మహిమలోనికి గొనిపోతావు"

అన్నాడు వో కీర్తనకారుడు - 73,24, 16వ కీర్తన చెప్పిన భక్తుడు ప్రభువు నుద్దేశించి

"నీవు నన్ను పాతాళానికి పంపవు
నీ పరిశుద్దుని గోతిపాలు చేయవు"

అని వాకొన్నాడు-16,10. ఇక్కడ "గోతిపాలు చేయవు" అనే భాగానికి "కుళ్లు పట్టనీయవ" అనే పాఠాంతరంకూడ వుంది. ఈ భక్తుడు మరణానంతరం తాను పాతాళంలో నాశమైపోననీ ప్రభువు తనకు ఉత్థాన భాగ్యాన్ని దయచేస్తాడనీ నమ్మాడు. తర్వాత నూత్న వేదకాలంలో అపోస్తలులు ఈ కీర్తన వాక్యాన్ని క్రీస్తుకి అన్వయింప జేసారు - అచ 13,35-37.

పూర్వవేదాంతంలో వచ్చే దానియేలు గ్రంథంలో ఉత్తాన భావం స్పష్టంగా కన్పిస్తుంది. "సమాధుల్లో నిద్రించే వాళ్ళల్లో అనేకులు మేలుకొంటారు. వాళ్ళల్లో కొందరు నిత్యజీవాన్ని అనుభవిస్తారు. కొందరు నిత్యావమానం పొందుతారు" అంటుంది ఈ పుస్తకం 12,2.

రెండవ మక్కబీయుల గ్రంథం అంటియోకసురాజు యూదులను వేదహింసకు గురిచేసిన తీరును వివరిస్తుంది. అతడు ఏడురు సోదరులను వరుసగా ఒకరి తర్వాత ఒకరిని చంపించాడు. వారిలో రెండవవాడు ఘటోరబాధలతో ప్రాణాలు విడుస్తూ రాజు నుద్దేశించి “రాక్షసుడా! నీవు మమ్మ చంపించవచ్చుగాక. కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్తాన భాగ్యాన్ని దయచేసి మేము శాశ్వతంగా జీవించేలా చేస్తాడు" అని పల్మాడు - 2 మక్క7,9.