పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/301

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వస్తువులను ఉపేక్షించి మోక్షవస్తువులను ఘనంగా యెంచాలని చెప్తాయి. క్రీస్తు జయంతి సందర్భంలో వచ్చే ప్రార్థన "ప్రభూ! నేడు మామీద అవతరించిన జ్యోతిని మేము మోక్షంలోగూడ దర్శించేభాగ్యాన్ని ప్రసాదించు" అంటుంది. క్రీస్తు మోక్షారోహణం సందర్భంలో వచ్చే ప్రార్ధనం "ప్రభూ! మేము ఈ దినం నీ కుమారుడు మోక్షరోహణం చేసాడని విశ్వసిస్తున్నాం. అతనితోపాటు మేముకూడ మోక్షంలో వసించే భాగ్యాన్ని ప్రసాదించు" అంటుంది. దివ్యసత్ర్పసాద పండుగ సందర్భంలో వచ్చే ప్రార్థనం "ఓ ప్రభూ! నీ దివ్యశరీర రక్తాలను స్వీకరించిన మేము మోక్షంలో నీ దివ్యత్వాన్ని దర్శించి ఆనందింతుముగాక" అని చెప్తుంది. మనం ఈలోకానికి అంటిపెట్టుకొని ఉండకూడదనీ, మోక్షాన్నీ దైవదర్శనాన్నీ ఆశించాలనీ ఈ ప్రార్థనల భావం. కనుక మనం అవశ్యం మోక్షంమిూద కోర్కె పెంపొందించుకోవాలి.

ప్రార్థనా భావాలు

1. ఇక్కడ మనకు పరిపూర్ణానందం ఉండదు. అది మోక్షంలోగాని సిద్ధింపదు. మన యిల్లు ఇక్కడకాదు, అక్కడ. మనం చేరవలసిన రేవు అక్కడుంది. కనుక మనం ఆ పరలోకానికి యాత్ర చేసే నావికులం. ఇక్కడ మనకు స్థిరమైన పట్టణం ఏదీ లేదు. రాబోయే నగరం కోసం ఎదురుచూడాలి - హెబ్రే 13,14. మన హృదయాలను పరలోకంలోని వస్తువులవైపు మరల్చాలి - కొలో3,1-2. కనుక ఈ లోకాన్ని మాత్రమే నమ్ముకొనేవాడు మోసపోతాడు. పరలోకంవైపు దృష్టి త్రిప్పేవాడు బాగుపడతాడు.
2. మోక్షంలో మనం పునీతుల బాంధవ్యాన్ని పొంది సంతోషిస్తామని చెప్పాం. కాని తోడినరులతో సఖ్య సంబంధాలను ఈ లోకంలోనే ప్రారంభించాలి. ఇక్కడ తోడిజనుల పట్ల ఆదరాభిమానాలు చూపించాలి. విశేషంగా పేదసాదలను ఆదుకోవాలి. మనకున్నది తులమో ఫలమో వాళ్ళతో పంచుకోవాలి. ఈ లోకంలో తోడినరులపట్ల ప్రేమతో జీవించనివాడు పరలోకంలో పునీతులబాంధవ్యానికి అరుడుకాడు.