పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనం సిలువ నిబంధనం ద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. ఈ సిలువ నిబంధనమే జ్ఞానస్నానంలో మనమీద సోకుతుంది. క్రీస్తుతో ఐక్యమైనవాళ్లు అతనితో ఐక్యమైన ఇతర నరులతోగూడ ఐక్యమౌతారు.

పైన పేర్కొన్నపూర్వవేదపు యూదుల ఐక్యతకాని నూత్నవేదపు క్రైస్తవుల ఐక్యతగాని ఈ భూమిమిద ముగిసేది మాత్రమే కాదు. అది పరలోకంలోగూడ కొనసాగుతుంది. అదే పునీతుల బాంధవ్యం. మనం దివికేగినపుడు ఈ పునీతులను కలసికొంటాం.
నూత్నవేదంలో పరలోకాన్ని గూర్చిన వర్ణనలు ఎక్కువగా దర్శన గ్రంథంలో ఉన్నాయి. ఆ పుస్తకం మోక్షంలోని భక్తులను గూర్చి చెప్తూ "తదనంతరం నేను అటు చూడగా అక్కడ గొప్ప జనసమూహం కన్పించింది. దానిసంఖ్య లెక్కకు మిక్కుటంగా వుంది. ఆ జనంలో అన్నిజాతులవారు, అన్ని తెగలవారు, అన్ని భాషలవారు కలసిఉన్నారు. వాళ్లు సింహాసనానికి గొర్రెపిల్లకీ ఎదురుగా నిల్చి ఉన్నారు" అని నుడువుతుంది - 7,9, ఈ జనసమూహమే పరలోకంలో పరస్పరం ఐక్యమైయున్న పునీతులు.
రోజూ పూజారాధనంలో "ఉత్థానమౌతామనే నమ్మకంతో చనిపోయిన మా సోదరీసోదరులను, విూ కనికరమందు చనిపోయినవారందరిని స్మరించండి. వారిని మి దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనండి. మా అందరికి దయచూపండి. దేవుని కన్యమాతయగు మరియూంబతోను, అపోన్తలులతోను, ఆదినుండి మీకు సేవలు చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యజీవంలో భాగం దయచేయండి" అని ప్రార్ధిస్తాం. ఇంకా యేటేట సకలార్చ్యశిష్టుల పండుగ జరుపుకొని ఆ పనీతులందరికి ప్రార్థనలర్పిస్తాం. ఈ ప్రార్థనలు ఫలించి మనం మోక్షంలోని పునీతులతో ఐక్యమౌతాం. అక్కడ దేవమాత సన్మనస్కులు అర్చ్యశిష్టులు మొదలైన వాళ్ళనందరినీ కలుసుకొని సంతోషిస్తాం. ఈ లోకంలో మనకు రక్తబంధువులుగా ఉండినవాళ్ళను కూడ మోక్షంలో మళ్ళా కలుసుకొని ఆనందిస్తాం. ఈ సందర్భంలో సిప్రియను భక్తుడు ఈలా చెప్పాడు. "మోక్షంలో ఓ పెద్ద భక్త బృందం మనకోసం ఎదురుచూస్తూంటుంది. వాళ్ళల్లో మనకు ప్రీతిపాత్రులైన తల్లిదండ్రులూ సోదరీసోదరులు పుత్రీపుత్రులుకూడ ఉంటారు. మనకోసం కాచుకొనివుండే ఆ బృందం చాల పెద్దది. వాళ్లకు తమ రక్షణాన్ని గూర్చి చింతలేదు. మన రక్షణాన్ని గూర్చి మాత్రం నిరంతరం చింతిస్తూంటారు. వాళ్ళ సన్నిధిలోనికి వెళ్ళి వాళ్ళను ఆలింగనం చేసికొన్నపుడు మనకు పరమానందం కలుగుతుంది. అక్కడ ఇక మృత్యుభయం ఉండదు. అక్కడ అందరమూ నిత్యజీవాన్ని పొంది మహానందం చెందుతాం." ఈలా మోక్షం దేవుణ్ణి కలుసుకొనే తావు మాత్రమే కాదు, తోడి పునీతులను కలసికొనేతావు కూడ.