పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్తిగా గ్రహించగల్గితే అతడు దేవుడే కాదు. అపరిపూర్ణులైన సృష్టిప్రాణులకు అనంతుడైన భగవంతుడు సంపూర్ణంగా దొరకడు. చిన్న చెంబు సముద్రంలో ఎంతనీటిని గ్రహించగల్లుతుంది? మోక్షంలో నరులు కూడ భగవంతుణ్ణి కొద్దిగానే గ్రహిస్తారు. మన తరపున మనం అతన్ని పూర్తిగా గ్రహించినా, అతని తరపున అతన్ని పూర్తిగా గ్రహించలేం, లోతైన సముద్రంలో రాయివేస్తే అది క్రమేణ అడుగునకు చేరుకొంటుంది. కాని భగవంతుడనే సముద్రంలోకి దిగితే ఆ సముద్రానికి అడుగే ఉండదు. కనుక మనం ఏనాడూ ఆ ప్రభువు అంతాన్ని చూడలేం.

నరునికి భగవంతుణ్ణి తెలిసికొని ప్రేమించాలనేకోరిక మిక్కుటంగా ఉంటుంది. ఈ కోరికతో మనం మోక్షంలో క్షణక్షణమూ భగవంతుణ్ణి అధికాధికంగా తెలిసికొని ప్రేమిస్తూనే ఉంటాం. ఈ దృష్టితో జూస్తే స్వర్గంలో నిరంతరమూ పెరుగుతూనే ఉంటాం. కాని మనం ఆ దేవుణ్ణి ఎంత తెలిసికొన్నామనకుతెలియంది ఇంకా చాలా ఉండిపోతుంది. దీనివల్ల మనకు అసంతృప్తి యేమి కలుగదు. మిక్కుటమైన ఆశతో ఆ ప్రభువుని ఇంకా అధికంగా తెలిసికోగోరుతూంటాం.
పరలోకంలో దేవుడు మనలను శాశ్వతంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమకు అంతం ఉండదు. దేవుని ప్రేమనుపొంది మనంకూడ అతన్ని శాశ్వతంగా ప్రేమిస్తాం. ప్రేమిస్తున్నంత కాలం, ప్రేమను పొందుతున్నంతకాలం, నరులు సంతోషంగా ఉంటారు. కనుక మనం అక్కడ దేవుని ప్రేమలో మునిగితేలుతూ కలకాలమూ శాంతిసంతోషాల ననుభవిస్తాం.

5. పునీతుల బాంధవ్యం

మోక్షంలో భక్తులు కేవలం ముగ్గురు దైవవ్యక్తులతో మాత్రమే ఐక్యంగారు, వాళ్ళ ఒకరితో ఒకరుగూడ ఐక్యమౌతారు. ఈ లోకంలో మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడే అతనితో ఐక్యమౌతాం. ప్రభువుతో ఐక్యమైనవాళ్లు తమలో తాము గూడ ఐక్యమౌతారు. ఈ ఐక్యతనే జ్ఞానశరీరం అంటాం. జ్ఞానశరీరం అనే భావం ఓవైపు క్రీస్తుతో మనకుండే సంబంధాన్నీ మరోవైపు క్రైస్తవులతో మనకుండే సంబంధాన్నీ తెలియజేస్తుంది.

క్రీస్తు ఈలోకంలో తన శిష్యులు ఒకరితో ఒకరు ఐక్యం కావాలని తండ్రిని ప్రార్థించాడు. "మనవలె వాళ్లు ఒకరుగా ఐక్యమైయుండాలి" అని మనవి చేసాడు - యోహా 17,22. అనగా తండ్రీ క్రీస్తూ యేలా పరస్పరం ఐక్యమైయుంటారో అలాగే అతని శిష్యులుకూడ ఒకరితో ఒకరు ఐక్యమై యుండాలి.

పూర్వవేదంలో యిస్రాయిలు ప్రజలు సీనాయి నిబంధనం ద్వారా ప్రభువుతో ఐక్యమయ్యారు. ఆ నిబంధనం వల్లనే వాళ్లు పరస్పరంగూడ ఐక్యమయ్యారు. నూతవేదంలో