పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుడ్డి దర్శించడమంటే ఆ ప్రభువు సాన్నిధ్యంలో ఉండిపోవడం. అతన్ని వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవడం. అతని ప్రేమకు నోచుకోవడం, అతన్ని తలంచుకొని ఆనందించడం. ఈ యనుభూతులన్నిటినీ కలిగించేదే మోక్షం.

సాధారణంగా మనం ఈలోకంలో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడం. విశ్వాసంతో మాత్రం అతన్ని నమ్ముతాం. ఈ నమ్మకం మనకు దైవానుభూతిని కలిగిస్తుంది. కాని ఈ యనుభూతి ఇక్కడ అస్పష్టంగా ఉంటుంది.అద్దంలో ప్రతిబింబం మసకగా కన్పిస్తుంది. అలాగే ఈలోకంలో దేవుడు అస్పష్టంగాగాని అనుభవానికిరాడు. కాని మోక్షంలో అతన్ని ప్రత్యక్షంగా, మూఖాముఖి దర్శిస్తాం. దేవుడు మనలను ఎరిగినట్లే మనమూ అతన్ని ఎరుగుతాం - 1కొరి 13,12,

క్రీస్తు శిష్యులకొరకు తండ్రిని ప్రార్ధిస్తూ "తండ్రీ! ఏకైక సత్యసర్వేశ్వరుడవైన నిన్నూ నీవు పంపిన యేసుక్రీస్తునీ తెలిసికోవడమే నిత్యజీవం" అని పల్కాడు - యోహా 178. హీబ్రూ సంప్రదాయం ప్రకారం "ఎరగడం” “తెలిసికోవడం" అంటే కేవలం జ్ఞానం మాత్రమేకాదు. ప్రేమకూడ. కనుక మనం మోక్షంలో భగవంతుణ్ణి బాగా తెలిసికొంటాం, ప్రేమిస్తాం గూడ.

మనం దేవుని బిడ్డలం. కనుక తండ్రియైన దేవుణ్ణి దర్శిస్తాం. జ్ఞానస్నానం పొందినపడే మనం దేవుని బిడ్డలమౌతాం. అప్పటినుండి దేవుణ్ణి దర్శించేశక్తి మనకు లభిస్తుంది. మోక్షంలో ఈ శక్తిపరిపూర్ణమౌతుంది. కనుక అక్కడ దేవుణ్ణి ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా చూస్తాం - 1 యోహా 32.

2. మోక్షం దైవజ్యోతి

యెరూషలేము దేవళం ఎప్పడూ వెలుగుతో నిండి ఉండేది. దానిలో సప్తశాఖలుకల దీపస్తంభం ఉండేది. వాటిలో మూడుశాఖలు దినమంతా వెలుగుతూండేవి. రాత్రిలో ఏడుశాఖలూ వెలుగుతూండేవి. గుడారాల ఉత్సవం, దేవాలయ ప్రతిష్ఠోత్సవం వచ్చినపుడు ఇంకా యొక్కువ దీపాలుకూడ వెలిగించేవాళ్లు, వీటన్నిటితో యెరూషలేం దేవళం రాత్రంతా మిరుమిట్ల గొల్పుతూండేది. అది ప్రధానంగా తేజోనిలయమైన మందిరం, దాని కాంతిలో యెరూషలేం నగరంకూడ ప్రకాశిస్తూండేది. ఈ కాంతిమయమైన దేవాలయం జ్యోతిర్మయమైన స్వర్గానికి చిహ్నంగా ఉండేది.

వెలుగులేకుండా యూదులు తమ దేవాలయాన్ని కాని దేవుణ్ణి కాని ఊహించుకొనేవాళ్లు కాదు. తండ్రి నరులు చేరరాని దివ్యతేజస్సులో వసించేవాడు - 1తిమో 6,16. అతడు వెలుగునే బట్టనుగా ధరిస్తాడు - కీర్తన 1042. క్రీస్తు ఆ తండ్రి