పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీవు నన్ను పాతాళం వాత బడనీయవు

నీ భక్తుణ్ణి మృతలోకంపాలు చేయవు

నీవు నాకు జీవనమార్గాన్ని చూపిస్తావు

నీ సాన్నిధ్యం నా కమితానందం కలిగిస్తుంది

సదా సంతోషాన్ని దయచేస్తుంది" -16,8-11

ఈ కీర్తనలో భక్తుడు భగవత్సాన్నిధ్యాన్ని తలంచుకొన్నాడు. ఆ సాన్నిధ్యం తన్ను సురక్షితంగా వుంచుతుందని నమ్మాడు. ప్రభువు అతని మరణానంతరం అతన్ని పాతాళలోకంలో వదలివేయడు. అతనికి ఉత్తానభాగ్యాన్నీ దైవదర్శనాన్నీ దయచేస్తాడు. అదే జీవనమార్గం, పరలోకంలో దైవసాన్నిధ్యం అతనికి అమితానందాన్ని కలిగిస్తుంది. దైవసాన్నిధ్యం మీదా మోక్షంమీదా ఆ కీర్తనకారునికున్న కోరిక అలాంటిది. "నీ ప్రేమ అమూల్యమైంది

నరులకు నీ రెక్కలమాటున ఆశ్రయం దొరుకుతుంది

వాళ్ళు నీ ఆలయంలో సమృద్ధిగా లభించే

భోజనం సాపడతారు

నీ మంచితనం అనే నది నుండి పానీయం సేవిస్తారు

నీవు జీవపు చలమవు

నీ వెలుగువలన మేమూ వెలుగు చూస్తాం" — 36,7-9,

కీర్తనకారులు యెరూషలేము దేవళంలో దేవుణ్ణి పూజించుకొని అతని సన్నిధిలో ప్రార్థనలు అర్పించుకొన్నారు. వాళ్ళభక్తికి దేవాలయమే కేంద్రం. కాని వాళ్లు దేవాలయంలోని దేవునితోపాటు మోక్షంలోని దైవసాన్నిధ్యాన్ని కూడ నమ్మారు. కనుక వాళ్లు దైవసాన్నిధ్యాన్ని గూర్చి మాటలాడేటప్పడు వాళ్ళ భక్తిలో దేవాలయమూ పరలోకమూ మిళితమై ఉంటాయి. ఈ 36వ కీర్తనను చెప్పిన భక్తుడు దేవునికి రెండుపమానాలు వాడాడు. అతడు జీవపు చెలమ, అనగా ఎప్పడూ వట్టిపోని ఊట. దేవాలయంలోను పరలోకంలోను భక్తులు ఆ వూటనుండి వూరే నీటిని త్రాగుతారు. ఇంకా, ఆ ప్రభువు వెలుగు. ఆ వెలుగులో భక్తులు వెలుగును చూస్తారు. ఇక్కడ ఊటా వెలుగూ దైవజీవనానికి సంకేతాలు. కనుక భక్తులు దేవునినుండి వరప్రసాదమూ ఆనందమూ రక్షణమూ మొదలైన భాగ్యాలు పొందుతారని భావం, సంగ్రహంగా చెప్పాలంటే, 36వ కీర్తన వ్రాసిన భక్తుడు తాను వెలుగూ వూటఐన దేవుణ్ణి దర్శిస్తానని నమ్మాడు,