పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గూడ ఉత్తరించే స్థలంలోని ఆత్మలకు ఈలాగే ఉపయోగపడతాయి. మన కాలం దేవుణ్ణి బాధించదు. మన కాలానికీ ఉత్తరించే స్థలానికీ అసలు సంబంధం లేదనికూడ ముందే చెప్పాం

ఇక, ఉత్తరించే స్థలంలోని ఆత్మలకొరకు మనం ఏలాంటి ప్రార్థనలు చేయవచ్చు? ఈ భూలోకంలో మనం చేసే పుణ్యక్రియలు ఉత్తరించే స్థలంలోని ఆత్మలకు ఉపయోగపడతాయనేది విశ్వసనీయమైన వేదసత్యం. దీనికి కారణం అర్యశిష్ణుల పరస్పర సంబంధం. అనగా మోక్షంలోను ఉత్తరించే స్థలంలోను భూలోకంలోను ఉన్న క్రైస్తవులకు పరస్పర సంబంధం ఉంటుంది. ఒకరి పుణ్యక్రియలొకరికి ఉపయోగపడతాయి. ఒకరి ప్రార్ధన లొకరికి ఫలితాన్నిస్తాయి.

మనమట్టుకు మనం ప్రార్థనలూ దానధర్మాలూ ఉపవాసాలూ శ్రమలూ పరిపూర్ణ ఫలాలూ మొదలైనవాటిని ఉత్తరించే స్థలంలోని ఆత్మల పాపపరిహారం కొరకు అర్పించవచ్చు అన్నిటికంటె ముఖ్యంగా పూజబలి వాళ్ళకుపయోగపడుతుంది. కనుక మనం పూజను వాళ్ళకొరకు అర్పించాలి. పూజలో వాళ్ళను భక్తితో స్మరించుకోవాలి

ప్రార్ధనా భావాలు

1. ఈ లోకంలో మనం సత్కార్యాలు చేయవచ్చు. వాటిద్వారా పుణ్యాన్ని ఆర్థించవచ్చు ఈ పుణ్యంద్వారా మన పాపావశేషాలకు మనమే ప్రాయశ్చిత్తం చేసికోవచ్చు, కాని చనిపోయాక మనం ఇక సత్కార్యాలుచేసి పుణ్యాన్ని ఆర్ధించలేం. మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసికోలేం. అందుకే ఉత్తరించే స్థలంలోని ఆత్మలు తమకుతాము ఏలాంటి సహాయమూ చేసికోలేరు, తమ పాపావశేషాలకొరకు బాధలుమాత్రం అనుభవించగలరు, అంతే. వాళ్లకు వాళ్లు సహాయం చేసికోలేరు కనుక, మన సహాయం వాళ్ళకు అవసరమౌతుంది. మన సహాయాన్ని పొందకపోతే వాళ్ళ పూర్తిగా శిక్షననుభవించి శుద్ధిని పొందాలి. మనసహాయమందితేవాళ్ళ శిక్షకొంతవరకు తగ్గుతుంది. కనుక మన పుణ్యకార్యాలద్వారా మనం వాళ్ళశిక్షను తగ్గిస్తూండాలి. ఉత్తరించే స్థలంలోని ఆత్మలు అక్కడున్నప్పడు మనకేలాంటి సహాయమూ చేయలేరు. మోక్షానికి వెళ్ళాక మనకు సాయం చేస్తారు.

2. చనిపోయిన వాళ్ళల్లో మన దగ్గరి బంధువులూ మనకు మేలు చేసినవాళ్ళూ ఉండవచ్చు. వీళ్ళ మన సహాయాన్ని అపేక్షిస్తారు. కనుక మనం వీళ్ళకొరకు ప్రార్ధనలూ పూజబలులూ మొదలైనవాటినికి తప్పక అర్పించాలి.