పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భగవత్సాన్నిధ్యం కలిగిన నరుడు ఆనందాన్నీ భయాన్నీ కూడ పొందుతాడని చెప్తుంది బైబులు, మోషే మండుతూన్న పొదలో దేవుడ్డి చూచి ఆనందించాడు, భయపడ్డాడు కూడ. అలాగే యేలీయా హోరేబు కొండమీద దేవుణ్ణిచూచి సంతోషించాడు, భయపడ్డాడు కూడ. నూత్నవేదంలో శిష్యులు తబోరు కొండమీద క్రీస్తు దివ్యరూపాన్ని చూచి సంతోషించారు, భయపడ్డారు కూడ - మత్త 17,2-6. ఇంకా దేవుడు నిప్పులాంటివాడు. ఆ నిప్పు నరుణ్ణి దహిస్తుంది, శుద్ధిచేస్తుంది కూడ.

మన మరణసమయంలో ఉత్థానక్రీస్తు మనకు జ్యోతిర్మూర్తిగా దర్శనమిస్తాడు. మనలను తన జ్యోతిఃప్రవాహంలో ముంచుతాడు. ఆ జ్యోతి మనకు ఆనందకరంగా ఉంటుంది. ఇంకా ఆ పవిత్రమూర్తి తన తేజోకిరణాలతో మనలను శుద్ధిచేస్తాడు గూడ. అతని తేజస్సూ అగ్నీ మన పాపాభిలాషలనూ వస్తువ్యామోహాలనూ స్వార్థపరత్వాన్నీ దహించివేస్తాయి. దీనివల్ల మన ఆత్మ శుద్ధిని పొందుతుంది. ఈ దహనమూ ఈ శుద్దీకరణమూ మన ఆత్మకు బాధను కలిగిస్తాయి. దైవసాన్నిధ్యం సంతోషాన్నీ బాధనూకూడ కలిగిస్తుంది. కాని ఈ బాధ ద్వారానే మన ఆత్మలోని పాపమాలిన్యం తొలగిపోతుంది. పావిత్ర్యం సిద్ధిస్తుంది. ఉదయాన సూర్యుడు వెలుగొందగానే మంచుబిందువులు కరిగిపోతాయి. అలాగే ఉత్తానమూర్తియైన ప్రభువు సూర్యుడిలా మన ఆత్మవిూద ప్రకాశింపగానే దానిలోని మాలిన్యమంతా కరిగిపోతుంది. అది నైర్మల్యాన్ని పొందుతుంది.

దేవుడే మన కడగతి, మనం దేవుణ్ణి పొందినపుడు అతడే మనకు మోక్షమౌతాడు. అతన్ని కోల్పోయినపుడు అతడే మనకు నరకమౌతాడు. మనకు న్యాయం చెప్పినపుడు అతడే మనకు కడతీర్చు ఔతాడు. మనలను శుద్ధి చేసినపుడు అతడే మనకు ఉత్తరించే స్థలం ఔతాడు. ఈ రీతిగా దేవుడు తన కుమారుడైన క్రీస్తుద్వారా మనకు మోక్షమూ, నరకమూ, కడతీర్పూ ఉత్తరించే స్థలం అన్నీ తాడు.

అగస్టీను భక్తుడు భావించినట్లు మన శుద్దీకరణం మరణ సమయంలోనే జరుగుతుంది. మన మరణంకూడ ఈ శుద్దీకరణంలోను దానివల్ల కలిగే బాధలోను భాగమరొతుంది.

నరులు ఉత్తరించే స్థలంలో ఎంతకాలముంటారనేది మనం కేవలం మనుష్యభాషలో అడిగే ప్రశ్న ఆ చోటుని అసలు మన కాలంతో కొలవలేం. ఉత్థాన క్రీస్తు మనం చనిపోయే సమయంలో ఒక్క నిమిషంలోనే మన ఆత్మను శుద్ధి చేయవచ్చు. ఈ శుద్ధిలో సంతోషమూ బాధా రెండూ ఉంటాయని ఎప్పాం. ఎక్కువ మాలిన్యంకల ఆత్మలు ఒక్క నిమిషంలోనే ఎక్కువ బాధ ననుభవించి పూర్ణశుద్ధిని పొందవచ్చు. కనుక ఉత్తరించే స్థలం మామూలుగా మన మనుకొన్నట్లుగా ఎక్కువకాలముండేది కాదు. కాని అక్కడ ఎక్కువ బాధా, ఎక్కువగా శుద్ధిని పొందడం అనేవి మాత్రం ఉంటాయి.