పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మక్క 12,39-45. ఈ సంఘటననుబట్టి మనం చనిపోయినవాళ్ళ పాపపరిహారానికి బలులూ ప్రార్థనలూ సమర్పింపవచ్చునని అర్థం చేసికోవాలి.

ఈ వేదసత్యం బైబుల్లో కన్పించదని చెప్పాం. కాని బైబుల్లో స్పష్టంగాలేని వేదసత్యాలుకూడ తొలినాటి క్రైస్తవుల్లో వ్యాప్తిలోకి వచ్చాయి. ఉత్తరించే స్థలాన్ని గూర్చిన వేదసత్యం గూడ ఈలాంటిదే. తొలిరోజుల్లోనుండి "అర్చ్య శిష్ణుల సంబంధ ప్రయోజనం" అనేది వాడుకలో ఉంది. అనగా మోక్షంలోని విజయక్రైస్తవులు, ఉత్తరించే స్థలంలోని బాధామయ క్రైస్తవులు, భూలోకంలోని యుధ్యమాన క్రైస్తవులు ఒకరికొరకొకరు ప్రార్థనలు చేసికోవడమూ, ఒకరినుండి ఒకరు జ్ఞానలాభాలు పొందడమూ తొలినాళ్ళనుండి వాడుకలో ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ లోకంలో బ్రతికివున్న క్రైస్తవులు చనిపోయిన తమ బంధువుల పాపపరిహారానికి ప్రార్ధన లర్పించేవాళ్లు.

ఇంకా తొలిరోజులనుండి చనిపోయినవారికొరకుకూడ పూజలో ప్రార్ధనలర్పించేవాళ్లు. ప్రస్తుత పూజలో ఈ ప్రార్థనం "ఉత్థాన మౌతామనే నమ్మకంతో చనిపోయిన మా సోదరీ సోదరులనూ, విూకనికరమందు చనిపోయినవారందరినీ స్మరించండి" అనే వాక్యంలో కన్పిస్తుంది.

ఈలా క్రైస్తవుల పరస్పర ప్రార్థనలు, పూజబలి ప్రార్థనలు అనే రెండు క్రియలద్వారా ఉత్తరించే స్థలంలోని ఆత్మలకొరకు ప్రార్ధనలు చేయడం అనే సంప్రదాయం వ్యాప్తిలోకి వచ్చింది. రెండవ శతాబ్దంలోనే ఈ సంప్రదాయం వాడుకలో ఉన్నట్లు తెలుస్తూంది. నాల్గవ శతాబ్దంలో అగస్టీను భక్తుడు ఈ సంప్రదాయాన్ని స్పష్టంగా పేర్కొన్నాడు. అతడు చనిపోయినవాళ్ళ సాంకేతికమైన నిప్పలో కాలి తమ మాలిన్యాన్ని తొలగించుకొని శుద్ధిని పొందుతారని చెప్పాడు. ఈ శుద్దీకరణం మరణ సమయంలో జరగవచ్చునని అభిప్రాయపడ్డాడు. ఈ కార్యాన్నే ఇప్పడు మనం ఉత్తరించే స్థలం అని పేర్కొంటున్నాం. ఈలా ఉత్తరించే స్థలాన్ని గూర్చిన వేదసత్యం బైబుల్లో స్పష్టంగా లేకపోయినా తొలినాటి క్రైస్తవుల్లో క్రమేణ వ్యాప్తిలోకి వచ్చింది. క్రైస్తవమతానికి బైబులొక్కటేగాదు, తొలినాటి క్రైస్తవ పారంపర్యబోధకూడ ఆధారం. బైబుల్లో లేదన్న కారణంతో నేడు ప్రోటస్టెంటు శాఖలు ఉత్తరించే స్థలాన్ని అంగీకరించవు.

3. ఉత్తాన క్రీస్తువల్లా, పవిత్రాత్మవల్లా శుద్ధి

మామూలుగా మనం ఉత్తరించేస్థలం బాధలనుభవించే స్థలం అనుకొంటాం. కాని అది ప్రధానంగా శుద్ధిని పొందే తావు. ఈ శుద్ధి కూడ ఉత్థానక్రీస్తుని కలుసుకోవడం వల్ల లభిస్తుంది. కనుక దాన్ని ఉత్తాన క్రీస్తువల్ల శుద్ధిని పొందే తావునిగా భావించాలి. ఈ శుద్ధి ప్రక్రియలో బాధా ఆనందమూ రెండూ ఉంటాయి.