పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదురు తిరిగితేతప్ప, నరకానికి పోనక్కరలేదు. క్రీస్తు సిలువ విూద చనిపోయిందికూడ మనలను శిక్షించడానికికాదు, రక్షించడానికే. కనుక మనం రక్షణం పొందవచ్చు, పొందాలి.

3. మన తరపున మనం నరకాన్ని గూర్చి ధ్యానం చేసికొంటూండాలి, బుద్ధి పూర్వకంగా దేవునిప్రేమను నిరాకరించి శాశ్వతంగా అతని సాన్నిధ్యంనుండి వైదొలగడం భయంకరమైన నేరం. మన హృదయంలో ఆ భగవంతుని మిూదవుండే సహజ వాంఛను బుద్ధిపూర్వకంగా అణచుకోవడం ఘోరమైంది. నరకానికి పోయామంటే మన యీ జీవితాన్నే నాశం చేసికొన్నామన్నమాటే. ఈ జీవిత గమ్యాన్ని చేరుకోలేకపోయామన్నమాటే. ఈ జీవితంలో విజయాన్ని సాధించలేక ఓడిపోయామన్నమాటే. ఇంతకంటే దౌర్భాగ్యమేముంటుంది? కనుక భక్తుడు తరచుగా నరకాన్ని స్మరించుకొంటూండాలి, దానికి భయపడుతూండాలి.

గురువులు మొదలైనవాళ్ళ నరకాన్ని గూర్చి బోధిస్తూండాలి. అది మన విశ్వాస సత్యాల్లో ప్రధానమైనది కాదు. కాని మనం అహంకారంవల్ల అక్కడికిపోయే అవకాశం ఉంది. కనుక మన విశ్వాసులకు అప్పడప్పుడూ దాన్ని గూర్చి చెప్తుండాలి. నేడు చాలమంది బోధకులు నరకాన్ని గూర్చి అసలు మాట్లాడ్డమేలేదు. ఇది దురదృష్టకరం.

4. ఉత్తరించే స్థలం

క్రీస్తుని విశ్వసించి వరప్రసాద స్థితిలో చనిపోయిన వాళ్ళకుగూడ పరిశుదుడైన దేవుణ్ణి దర్శించడానికి చాలినంత పావిత్ర్యం ఉండకపోవచ్చు. వాళ్ళ ఆత్మలో ఇంకా మాలిన్యం ఉండవచ్చు. ఈ మాలిన్యాన్ని తొలగించడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం. ఈ యధ్యాయంలో నాల్గంశాలు పరిశీలిద్దాం.

1. ఉత్తరించే స్థలం అంటే ఏమిటి?

పాపశిక్ష నిత్యశిక్ష అనిత్యశిక్ష అని రెండు రకాలుగా ఉంటుంది, నిత్యశిక్ష అంటే నరకం. అనత్యశిక్ష అంటే కొన్ని తాత్కాలిక బాధలు అనుభవించడం. మనం మనపాపాలకు చక్కగా పశ్చాత్తాపపడి పాపసంకీర్తనం చేసికొన్నపుడు నిత్యశిక్ష తొలగుతుందేగాని అనిత్యశిక్ష తొలగదు. ఈ యనిత్యశిక్షను తొలగించుకోడానికి ఉద్దేశింపబడిందే ఉత్తరించే స్థలం.

మనకు అనిత్యశిక్ష ఎందుకు వస్తుంది? గాయం నయమయ్యాకగూడ దానిమచ్చ మిగిలివుంటుంది. అలాగే మన పాపాలు పరిహారమయ్యాకగూడ వాటి అవశేషాలు లేక దుష్ఫలితాలు మిగిలివుంటాయి. సృష్టివస్తువులకు అంటిపెట్టుకొని ఉండడం,