పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దైవసాన్నిధ్యాన్ని కోల్పోయాడు కనుక.ఈలా దైవసాన్నిధ్యాన్ని కోల్పోవడమే నరకాన్ని గూర్చిన ముఖ్యాంశం.

భగవంతుడు నరుణ్ణి తనకొరకే చేసాడు. అతని హృదయంలో తనమీద శాశ్వతమైన కోర్కెనుగూడ పెట్టాడు. అందుకే ప్రతినరుడూ సహజంగానే భగవంతుణ్ణి వాంఛిస్తాడు. కాని కొందరు బుద్ధిపూర్వకంగానే ఈ వాంఛను అణగదొక్కుకొంటారు. చావైన పాపంచేసి భగవంతునినుండి వైదొలగుతారు. అతన్ని నిరాకరిస్తారు. ఈ స్థితిలోనే చనిపోతారు. మరణానంతరం ఇక మనసు మార్చుకోవడమనేది ఉండదు. కనుక, వాళ్లు నరకంలో గూడ భగవంతుణ్ణి నిరాకరిస్తారు. అతని సాన్నిధ్యంనుండి వైదొలగుతారు. ఈలా బుద్ధిపూర్వకంగా భగవంతుణ్ణి నిరాకరించి అతని సాన్నిధ్యంనుండి వైదలొగడమే నరకం. సంగ్రహంగా చెప్పాలంటే దైవసాన్నిధ్యాన్ని దైవదర్శనాన్ని కోల్పోడమే నరకం. భగవంతుణ్ణి పొందితే మనకు పూర్ణానందం కలుగుతుంది. అతన్ని కోల్పోతే మనకు దుఃఖం కలుగుతుంది. కనుక నరకం దుఃఖమయమైంది.

మనం మామూలుగా నరకాన్ని ఓ తావుగా భావిస్తాం. కాని అదితావుకాదు, ఓస్థితి. దేవుణ్ణి కోల్పోయి దుఃఖించే స్థితి.

2. నరక శిక్షను ఎవరు విధిస్తారు?

మామూలుగా దేవుడే నరుణ్ణి నరకానికి పంపిస్తాడని అనుకొంటాం. అతడు మనం బ్రతికివున్నపుడు ప్రేమను చూపేవాడే ఐనా, మన మరణానంతరం కఠినంగా ప్రవర్తిస్తాడని యెంచుతాం. కానియిది పొరపాటు. దేవుడు ఎప్పడూ ప్రేమమయుడే అతని ప్రేమ ఏనాడూ మారదు. దేవుడు మనకు నరకాన్ని నిర్ణయించడు, మనమే దాన్ని నిర్ణయించుకొంటాం. అతడు ఓమారు మనకు స్వేచ్ఛను ఇచ్చాక ఆ స్వేచ్ఛను మన్నిస్తాడు. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసికొంటున్నా చూస్తూ ఊరకుంటాడేగాని మనలను నిర్బంధం చేయడు. నరుడు తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసికొని నరకానికి పోవడం చూచి భగవంతుడు దుఃఖిస్తాడు. అతని ప్రేమ అంత గొప్పది. అతడు ఓయి నరుడా! నీదుష్ట చిత్తం భూమిమిదవలె నరకంలోకూడ నెరవేరునుగాక అని చెప్తాడు. నరకందేవుడు నరునికి పెట్టే శిక్షకాదు. నరుడు తనకు తానే విధించుకొనేశిక్ష అది దేవుడు విధించే మరణశిక్షకాదు, నరుడు బుద్ధిపూర్వకంగా చేసికొనే ఆత్మహత్య పాపంద్వారా నరుడు దేవుణ్ణి నిరాకరిస్తాడు. ఆ నిరాకరణమే కడన నరకంగా రూపొందుతుంది. పశ్చాత్తాపపడని పాపమే నరకం.