పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ తీర్పులోని ముఖ్యాంశం ఇది. నరులు దేన్నిబట్టి దేవునినుండి శిక్షనుగాని బహుమతినిగాని పొందుతారు? జనులు తోడినరులపట్ల ప్రవర్తించే తీరునుబట్టే శిక్షనుగాని బహుమతిగాని వస్తుంది. క్రీస్తు తోడినరుల్లో ఉంటాడు. కనుక తోడినరులకు మేలుచేస్తే అతనికి మేలు చేసినట్లే తోడినరులకు కీడుచేస్తే అతనికి కీడుచేసినట్లే, "ఈ నా సోదరుల్లో అత్యల్పుడైన ఏవొక్కనికి విూరు ఇవి చేసినపుడు నాకు చేసితిరి" అనే 40వ వాక్యం భావమూ, "ఈ యత్యల్పుల్లో ఒకనికైనను మీరివి చేయనపుడు నాకును చేయలేదు" అనే 45వ వాక్యం భావమూ ఇదే. కనుక మనం కడతీర్పులో నెగ్గాలంటే దైవప్రేమతోపాట సోదరప్రేమనుగూడ పాటించాలి.

2. లూకాభావాల ప్రకారం తీర్పు లోకాంతంలోగాక మనం మరణించిన వెంటనే జరుగుతుంది. ఇతని సువివేషం 16వ అధ్యాయంలో ధనికుడు - లాజరు అనే సామెత వస్తుంది. ఈ యధ్యాయంలో మనకు కావలసింది 22-23 వచనాలు. లాజరూ ధనికుడూ ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన వెంటనే దేవదూత లాజరుని అబ్రాహాము వొడిలోనికి, అనగా మోక్షానికి చేర్చాడు. ధనికుడు పాతాళానికి, అనగా నరకానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ లోకాంతంలోని సాధారణ తీర్పుదాకా ఆగకుండానే, చనిపోయిన వెంటనే, దేవునినుండి బహుమతినీ శిక్షనూ పొందారు. అనగా వీళ్ళకు మరణించిన వెంటనే ప్రత్యేక తీర్పు జరిగింది.

ఈలాగే సిలువవిూద చనిపోయే క్రీస్తు మంచి దొంగతో "నేడే నీవు నాతో కూడ పరలోకంలో ప్రవేశిస్తావు” అని చెప్తాడు - లూకా 23,43, ఈ వాక్యంలో "నేడే" అంటే ఈ రోజే అని భావం. యూదులకు రోజు సూర్యాస్తమయంతో ముగుస్తుంది. కనుక మంచిదొంగ శుక్రవారం సాయంకాలం ప్రాదు క్రుంకకమునుపే, తాను చనిపోయిన వెంటనే, మోక్షంలో వుంటాడు. అనగా అతనికి మరణం ముగియగానే తీర్పు జరిగింది,బహుమతి లభించింది.

ఈలాగే అ.చ.1,25లొ "తన చోటికి పోవుటకు యూదా విసర్జించిన యీ పరిచర్యలో" అన్న వాక్యం వస్తుంది. యూదా చనిపోయిన వెంటనే తనకు నిర్ణయింపబడిన తావుకి వెళ్ళిపోయాడు. అనగా అతనికిగూడ మరణించిన వెంటనే తీర్పు జరిగింది.

ఈ యాలోకనాలన్నిటినిబట్టి లూకా భావాన్ని అర్థంజేసికోవచ్చు. లోకాంతంవరకు ఆగనక్కరలేకుండానే మరణించిన వెంటనే మనకు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులోనే మనం శాశ్వతంగా బహుమతినో శిక్షనో పొందుతాం.

3. యోహాను 3,17-18లో ఈ వాక్యాలు తగులుతాయి. "ఆయనను విశ్వసించేవాడు తీర్పును పొందడు, విశ్వసించనివాడు ఈవరకే తీర్పుని పొందాడు. ఆ తీర్పు యిది. వెలుగు లోకంలోనికి వచ్చింది. కాని మనుష్యులు దుష్క్రియలుచేస్తూ