పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెరూషలేమునూ దేవదూతలనూ ఇంకా దర్శింపలేకుండా ఉన్నారు కనుక. ఈ లోకంలో నరుడు చెరలోలాగ ఉండిపోతాడు. చెరలో ఉన్నవాడు క్రమేణ ఆ చెర జీవితానికి అలవాటు పడిపోయి తన దౌర్భాగ్యాన్ని అర్థంజేసికొనే చేసికోడు. ఈ లోకజీవితంలో నరుడు కూడ అంతే. తల్లి గర్భంలోవున్న శిశువు ఆ గర్భంలోని చీకటిజీవితానికి అలవాటు పడిపోతుంది. ఆగర్భం నుండి వెలుపలికి వచ్చి వెలుగుని దర్శించడానికి ఇష్టపడదు. అందుకే శిశువులు పట్టేప్పుడు ఏడ్చి అల్లరిచేస్తారు. అలాగే నరులు కూడ ఈలోక జీవితంనుండి పరలోక జీవితంలోకి ప్రవేశించడానికి ఏమాత్రమూ ఇష్టపడరు. మంత్రసాని బిడ్డ పుట్టడానికి తోడ్పడుతుంది. మృత్యువు గూడ ఓ మంత్రసానిలా మెలుగుతుంది. అది చనిపోయేవాళ్లు పరలోక జీవితంలోకి పుట్టడానికి తోడ్పడుతుంది. పూవునూ దానినుండి పట్టే పిందెనూ చూస్తుంటాంగదా! పూవు రాలిపోతేనేగాని పిందె కాయగా ఎదగదు. అలాగే మనం ఈ జీవితానికి చనిపోతేనే గాని పరలోక జీవితానికి పట్టం". ఈ వాక్యాల్లో గ్రెగోరీ వాడిన మూడు ఉపమానాలు - అనగా చెరలోఉన్న వ్యక్తి ,గర్భస్థశిశువు, కాయగా మారవలసిన పూవు - గమనింపదగ్గవి.

     రెండవ శతాబ్దానికి చెందిన అతనేష్యసు భక్తుడు ఈలా వాకొన్నాడు. "క్రీస్తు చనిపోయి ఉత్థానమయ్యాక మృత్యుభయం తొలగిపోయింది. క్రీస్తుకోసం ప్రాణాలర్పించే భక్తులు చావుని ఓ అల్పవస్తువులాగ తమ కాళ్ళక్రిందపడవేసి తొక్కుతారు. మరణంద్వారా ఈ జీవితం నాశంకాదనీ ఉత్తానంద్వారా అమరత్వాన్ని పొందుతామనీ వాళ్ళకు తెలుసు".
     రెండవ శతాబ్దంలో రోములో వేదసాక్షిగా మరణించిన ఇగ్నేప్యస్ భక్తుడు ఈలా వచించాడు. "రోములోని క్రీడాశాలలో నన్ను సింహాలకు మేతగా వేస్తారు. నన్ను జూచి భయపడకుండా వెంటనే నావిూదికి దూకి నన్నుమింగివేయవలసిందిగా నేను ఆ మృగాలను బుజ్జగిస్తాను. అవి నన్ను వధించినపుడుగాని నేను శిష్యుణ్ణి కాను. ఏశక్తి నన్ను క్రీస్తుని చేరనీయకుండా ఆటంకపరచుకుండునుగాక. నేను క్రొత్త పట్టువు పట్టడానికి ప్రసవవేదన పడుతున్నాను.మీరు నా మరణానికి ఆటంకం కలిగించి నా నూత్న జన్మనుభంగం చేయవద్దు. నన్ను నిర్మలమైన జ్యోతిని చేరుకోనీయండి. ఆ వెలుగుని సమిూపించినప్పడు గాని నేను పరిపూర్ణ మానవుణ్ణి కాను. చావుకి నేను ఉబలాటపడుతున్నాను. నాలోని జీవజలం నీవు శీఘ్రమే తండ్రి వద్దకు వెళ్ళు అని నన్ను హెచ్చరిస్తూంది. నేను మృత్యువుకోసం ఓప్రియునిలాగ తపించిపోతూన్నాను. ఇక యిూలోక సుఖాలమీద నాకు కోర్మెలేదు".
−
     ఇక క్రైస్తవ ఆరాధనంలోని ప్రార్థనలను పరిశీలిస్తే మనం మరణానికిభయపడనక్కరలేదు, దేవుణ్ణి నమ్మితే చాలు అనే భావం కన్పిస్తుంది. మృతుల పూజలో వచ్చే ప్రెఫేస్ ప్రార్థనం ఈలా చెప్తుంది. "మరణం తప్పదనే సత్యం మాకు దుఃఖాన్ని