పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వురి తొలగించింది. ఆ తొలికన్య అవిశ్వాసంతో మనకు ఓ ముడి పెట్టిపోయింది. ఈ మలికన్య విశ్వాసంతో ఆ ముడి విప్పింది" అని వ్రాసాడు. మరియు రెండవ యేవ. ఆ తొలి యేవ మనపతనానికి కారణమైనట్లే ఈ మలియేవ మన ఉద్ధరణానికి కారణమైంది. కనుక ఈమె రక్షణమాత. ప్రస్తుతం రక్షణ మాతనుగూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఇద్దరు ఏవలు

తొలి ఆదాము పాపంచేసాడు. అతడు మన నరజాతికి శిరస్సు. కనుక అతనిపాపం మనకూ సంక్రమించింది. అతని వలన మనమంతా పతనమైపోయాం. ఈ పాపానికి పరిహారం చేయడం కోసమే రెండవ ఆదాము క్రీస్తు వచ్చాడు.

ఆ తొలి ఆదాము పాపంలో ఓ స్త్రీ కూడ పాల్గొంది. ఆమె పాపం దానంతటదే మనలను నాశంజేసివుండదు, ఆదాము పాపం చేయకుండా ఏవమాత్రమే పాపం చేసినట్లయితే మనం పతనమైపోయివుండం. ఎందుకంటే ఆమె మనకు తలగాదు. కాని ఆదాము పాపముతోగూడి ఆమె పాపం కూడ మనకు నాశం తెచ్చి పెట్టింది.

తొలి ఆదాము మనలను నాశం జేసినట్లే మలి ఆదాము క్రీస్తు మనలను ఉద్ధరించాడు. అతనిలాగే ఇతడూ నరజాతికి శిరస్సు కనుకనే క్రీస్తు రక్షణం మనకూ సంక్రమించింది. ఈ రెండవ ఆదాము ఉద్ధరణంలో ఓ స్త్రీ కూడ పాల్గొంది. ఆమె ఉద్ధరణం దానంతటదే మనలను రక్షించి వుండదు. నరజాతికి శిరస్సు క్రీస్తకాని మరియకాదు. క్రీస్తు సిలువమీద చనిపోకపోయినట్లయితే మరియు ఎంత కృషిచేసినా మనకు రక్షణం లభించివుండదు. కాని క్రీస్తు రక్షణకార్యంలో మరియకూడ పాల్గొనడం వల్ల క్రీస్తుతోపాటు ఆమెకూడ మనలను రక్షించింది.

ఐనా క్రీస్తు రక్షణమూ మరియమాత రక్షణమూ ఒకే కోవకు చెందినవిగావు. క్రీస్తు మనకు అవసరమైన రక్షకుడు. అతడులేక నరజాతికి రక్షణంలేదు. పౌలు వాకొన్నట్లు “దేవునికీ మానవునికీ మధ్య ఒక్కడు మధ్యవర్తి, క్రీస్తు - 1తిమో 2,5. ఇక మరియమాత రక్షణం క్రీస్తు రక్షణంలాగ అవసరమైగాదు. ఔచిత్యంకోసం మాత్రమే. ఏమిటి ఆ ఔచిత్యం?

అక్కడ మన పతనంలో ఓ స్త్రీ పాల్గొంది అన్నాం. ఇక్కడ మన ఉద్ధరణంలోగూడ మళ్ళా ఓ స్త్రీ పాల్గొంటే ఔచిత్యంగా వుంటుందనుకొని దేవుడు క్రీస్తుతో ఈమెను జోడించాడు. ఆ యేవకు ఈ యేవ సరితూగు. క్రీస్తులేక మరియలేదు. క్రీస్తు రక్షణం లేక మరియమాత రక్షణంలేదు. క్రీస్తు రక్షణానికి మరియమాత రక్షణం ఏమి చేర్చదు. ఆమె రక్షణాన్ని తొలగించినా క్రీస్తు రక్షణం తగ్గిపోదు. కాని క్రీస్తు రక్షణంతో పాటు ఆమె రక్షణం కూడ వుంటుంది. క్రీస్తుతోపాటు ఆమెకూ స్థానం వుంది. ఆమెకు అసలు స్థానమేలేదు అనకూడదు.

16