పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవక్తలు ఆయన యింటికి అతిథులుగా వచ్చారు. కనుక ఆయన నీ నుండి మూడువేల నాణాలు రెండు జతల పట్టుబట్టలు కోరుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ గేహసీ నేరాల రెండు. మొదటిది, అతని అత్యాశ. రెండవది, అతడు గురువుగారిని గూర్చి అబద్ధం చెప్పడం. అనగా యెలీషా నామానునుండి ఈ సొమ్ము అడగకపోయినా అడిగాడని చెప్పడం.

నామాను ఉదారబుద్ధి కలవాడు. గేహసీ మూడువేలడిగితే అతడు ఆరువేలిచ్చాడు. ఆ సొమ్మును సేవకులనెత్తికెక్కించి గేహసీతో పంపించాడు, గేహసీయిల్ల ఓఫెలుకొండమీద వుంది. ఆ తావుకి రాగానే అతడు సేవకులవద్ద నుండి నాణాల సంచులు తీసికొని వారిని పంపివేసాడు. ఆ సంచులు భద్రంగా తన యింటిలో దాచుకొన్నాడు.

తర్వాత గేహసీ నంగనాచిలాగ తిరిగివచ్చి గురువు గారికి సేవచేయబోయాడు. కాని గురువుగారు అతన్ని నిలదీసి ఓయి! నీ వెక్కడికి వెళ్లావో చెప్ప అన్నాడు, అతడు నేనెక్కడికీ వెళ్ళలేదు. ఇంతసేపు ఇక్కడనే వున్నానుగదా అన్నాడు. కాని ఎలీషాకు దైవశక్తి దైవజ్ఞానమూ రెండూ వున్నాయి. అతడు గేహసీ చేసిన తప్పడుపని అంతా దర్శనంలో చూస్తూనే వున్నాడు. కనుక అతడు ఓయి! నేను ఇక్కడే వున్నానా మనసు నీతో వచ్చి నీవు చేసిన మోసమంతా చూచింది. నీవు దురాశతో నామాను దగ్గర డబ్బు తీసికొని దానితో పొలాలూ తోటలూ పశులమందలూ సంపాదించాలనుకొన్నావు. కావున నీకు శిక్ష యిది. నామానుని వదలివెళ్ళిన కుష్ట నిన్నూ నీ వంశీయులనూ పట్టిపీడిస్తుందిపో అన్నాడు. గురువు చెప్పిట్లే వెంటనే గేహసీకి కుష్ట సోకింది. అనగా గేహసీ ఇక తన వారసులకు ఆస్తినికాక కుష్టరోగాన్ని వదలిపోతాడు, ఇది దురాశకు ప్రతిఫలం.

పాఠకులు ఈ కథలో నామాను గేహసీలకుగల వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించాలి. నామాను ఉదారగుణం గలవాడు. గేహసీ ఆసబోతు. ఎలీషా నామాను విశ్వాసాన్ని పరీక్షింపగా అతడు విశ్వాసంకలవాడని రుజువైంది. కాని గేహసీ విశ్వాసం పరీక్షింపగా అతడు విశ్వాసం లేనివాడని తేలింది. నామానుకి విశ్వాసంవలన కుష్ట నయమైంది. గేహసీకి విశ్వాసం లేనందువలన కుష్ఠ సోకింది. ఒకడు మొదటలో కుష్టరోగి, మరొకడు కడపట కుష్ఠరోగి.

3. ప్రార్ధనా భావాలు

1. ఊరూపేరూలేని ఒక బానిసపిల్ల తన విశ్వాసం ద్వారా నామాను రోగవిముక్తికి కారకురాలైంది. ఆ బాలిక పరాయిదేశంలో గూడ తన విశ్వాసాన్ని దాచుకోలేదు. ఒకోసారి సామాన్య నరులే తోడిజనానికి దేవుణ్ణి గూర్చి శ్రద్ధగా బోధిస్తారు. కనుక వీళ్ళ సేవను మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఇంకా, నామాను కోపంతో యోర్గానులో మునగకుండా వెళ్ళిపోబోతూంటే సేవకులు అతనికి విశ్వాసం పుట్టించారు. కనుక వేదప్రచారంలో మనం ఈ సామాన్య జనాన్నిగూడ వాడుకోవాలి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వేదబోధ చేస్తారు.