పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ ప్రవక్తలు దేవుని ఆత్మ ఏలీయాను కొనిపోయి ఏ కొండల్లోనో లేక లోయల్లోనో జారవిడచి వుంటుందనుకొన్నారు. కనుక యాభైమంది మూడునాళ్ళపాటు అతనికోసం అంతటా వెతికారు. అటుపిమ్మట యెలీషా దగ్గరికి వచ్చి గురువుగారు ఎక్కడా కన్పించలేదని చెప్పారు. ఎలీషా అతడు మీకు దొరకడు. అసలు అతడు ఈ లోకంలో లేడు అని చెప్పాడు.

కాని యేలీయా ఏమైందీ ఎలీషా చెప్పలేదు. అతడు ఏలీయా మరణం తీరును వివరించలేదు. ఐనా అందరిలాగే ఏలీయా కూడ చనిపోయి వండాలి. ఆ చావు వైనం మనకు తెలియదు. ప్రభువు మాత్రం అతని ఆత్మను ఆదరంతో స్వర్గానికి కొనిపోయాడు.

అసలు ఇక్కడ రచయిత చెప్పదలచుకొన్న ముఖ్యాంశం ఏలీయా మరణమూ మోక్షారోపణమూకాదు. ఎలీషా గురువుగారికి వారసుడు అయ్యాడనేది అతడు తెలియజేయదలచుకొన్న ప్రధానాంశం. కనుకనే అతడు వెంటనే గురువుగారి శక్తితో శిష్యుడు చేసిన రెండద్భుతాలను పేర్కొన్నాడు.

గురువుగారి శక్తిని పొందిన ఏలీయా రెండు అద్భుతకార్యాలు చేసాడు. మొధటిది, రోగలక్షణాలున్న యెరికో నీటిని శుద్ధిచేయడం. అతడు కొత్తపిడతలో ఉప్పను తీసుకురమ్మన్నాడు. ఈ పిడత లౌకిక కార్యాలకు వాడిందికాదు. అది దైవసేవకే అంకితమై దైవశక్తితో నిండి వుంటుంది. అలాంటి పిడతలోని ఉప్పకూడ రోగలక్షణాలను తొలగించే సామర్థ్యం కలిగి వుంటుంది.

ఇక్కడ యెరికో ప్రజలు ప్రవక్తను గౌరవించారు. అతడు వారి అక్కరను తీర్చాడు.దైవాభాక్తుని గౌరవి0చె ప్రజలు దీవెన లభిస్తుందని ఈ కథ చెప్పిన రచయిత భావం.

ఎలీషా నీటిని శుద్ధిచేయడం అనే అద్భుతాన్ని నేడు మనం ఆదివారం పూజకు ముందుగా తీర్ధాన్ని చల్లేపుడు జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాం. ఆనాడు ఎలీషాలాగే నేడు మనంకూడ నీటిలో ఉప్పను కలుపుతున్నాం. ఆ నీటిని ప్రజలమీద చిలకరిస్తున్నాం. ఆ నీటిని చీలకరించిన తావుల్లో పిశాచ తంత్రోపాయాలు తొలగిపోయి పవిత్రాత్మసాన్నిధ్యం నెలకొంటుందని విశ్వసిస్తున్నాం.

ఇక, రెండవ అద్భుతం బేతేలుచెంత ఎలుగుబంట్ల చిన్నపిల్లలను చీల్చివేయడం. ఈ పిల్లలు ప్రవక్తను ఎగతాళి చేసారు. అతడు ఆ పిల్లలను శపించి వారు ఎలుగుబంట్ల వాతబడేలా చేసాడు. ఇక్కడ నిర్ధయథొ ప్రవర్తించాడు కదా అని నేడు మనం ప్రశ్నిస్తాం. కాని ప్రవక్తను నిందిస్తే శిక్ష తప్పదని తెలియజేయడానికి మాత్రమే రచయిత ఈ సంఘటనను ఇక్కడ పేర్కొన్నాడు.

పైగా బేతేలు విగ్రహారాధనకు నిలయం. పూర్వం యెరోబామురాజు ఇక్కడ క్రొత్తగా దేవాలయాన్ని కట్టించి బాలు ఆరాధనను ప్రచారం చేయించాడు-1రాజు 13,29-30. కనుక ఈ పట్టణం పిల్లలు విగ్రహారాధకుల పిల్లలు. కనుకనే ఇక్కడ వీరికి శిక్ష పడింది.

పై రెండు అద్భుతాలను ఉదాహరించడంలో రచయిత ఉద్దేశం సంగ్రహంగా ఇది. ప్రవక్తను గౌరవిస్తే దేవుని దీవెన లభిస్తుంది. అతన్ని అవమానపరిస్తే శిక్ష వస్తుంది.