పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రవక్త నేను ఆజ్ఞాపిస్తే తప్ప ఈ దేశంలో వాన కురవదని అన్నాడు. ప్రవక్త వాక్కులోని శక్తి అమోఘమైంది.ఈ యధ్యాయంలో యావే ఆరాధనం, ప్రవక్త వాక్కులోనిశక్తి అనే రెండంశాలూ ముఖ్యమైనవే. తన శాపవాక్యాలతో దేశంమీదికి కరువును రప్పించినందుకు రాజు ఏలీయాను చంపజూచాడు. కనుక ప్రవక్త పారిపోయి కెరీతువాగు పారే అరణ్యప్రాంతంలో తలదాచుకొన్నాడు. ప్రభువు తన ప్రవక్తను కాపాడతాడు కదా! కనుక దేవుని ఆజ్ఞపై రోజూ రేపూమాపూ కాకులు అతనికి రొట్టెలు కొనివచ్చేవి. ఆ కరవకాలంలో ప్రవక్త ఆ రొట్టెను తిని, ఆ వాగులోని నీళ్లు త్రాగి తన ప్రాణాలు నిల్పుకొన్నాడు. పూర్వం ప్రభువయిస్రాయేలు ప్రజలనుగూడ ఈ రీతినే ఎడారిలో అద్భుతంగా దయచేసిన ఆహారంద్వారా కాపాడాడని చదువుతున్నాం - నిర్గ 16,8. సరే, కొంతకాలానికి కరవు మదరగా కేరీతు వాగుకూడ వట్టిపోయింది. ఇక, రెండవభాగం సారెఫతు వితంతువు కథ, ప్రభువు ఏలీయాను కెరీతువాగు నుండి సీదోను దేశంలోని సారెఫతు నగరంలో వసించే ఓ వితంతువు దగ్గరికి పంపాడు. ఈ దేశంలో బాలుని కొల్చేవాళ్ళని చెప్పాం. యావేయిస్రాయేలు దేశంలోలాగే ఇక్కడకూడా అనావృష్టిని కలిగించాడు. ఐనా అతడు తన భక్తురాలైన వితంతువనీ ఆమె కుమారునీ మాత్రం చావునుండి కాపాడగోరాడు.

ప్రవక్త నగర ద్వారంవద్ద ఆ పేదరాలిని కలిసికొని అమ్మా! నాకు కొంచెం మంచినీళ్ళూ ఓ రొట్టా తీసికొనిరా అని చెప్పాడు. ఆమె నాయనా! ఈ కరవు కాలంలో రొట్టె లెక్కడివి? మా యింటిలో యింకా పిడికెడు గోదుమ పిండీ, కొంచెం ఓలివు నూనే మిగిలివున్నాయి. వాటితో చివరిరొట్టె కాల్చుకొని నేనూ నా కుమారుడూ తింటాం. ఆ మీదట కరువు వాతబడి చస్తాం అంది. ఆ మాటలకు ప్రవక్త తల్లీ! నీవూ నీ కుమారుడూ భుజించకముందు నాకొక రొట్టె చేసిపెట్టు. ప్రభువు నిన్నుకరుణిస్తాడు. నీకు యావే దీవెన యిది. ప్రభువు ఈదేశంలో వాన కురిపించేవరకు మీ కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరగిపోవు అని చెప్పాడు. 

ఆ వితంతువు ప్రవక్తమాట నమ్మింది. ముందుగా అతనికి రొట్టెజేసిపెట్టింది. తర్వాత తనూ తన కుమారుడూ రొట్టె కాల్చుకొని భుజించారు. ఈలా ఆ కరవు కాలమంతా గడచిపోయింది. మొదట తన వాక్కుతో వానను ఆపివేసిన ప్రవక్త ఇప్పడు మళ్ళా అదే వాక్కుతో ఆహారాన్ని కూడ సృజించాడు. ప్రభువే తన ప్రవక్త వాక్కుద్వారా పనిచేస్తుంటాడు. ఇక్కడ అహాబు విగ్రహారాధనం కరువుని తెచ్చిపెడితే, ప్రవక్త భక్తి వితంతువు విశ్వాసం ఆహారాన్ని చేకూర్చిపెట్టాయి.