పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. సారెఫతు వితంతువు 1రాజు 17

1. సందర్భం

అహాబురాజు క్రీస్తుపూర్వం 871-52 వరకు ఉత్తర రాజ్యమైన సమరియాను ఏలాడు. ఆ దేశాన్ని పాలించిన సమర్ధులైన రాజుల్లో అతడూ వొకడు. ఆ రాజు సీదోను రాజు కొమార్తెయైన యెసెబెలును పెండ్లాడాడు. సీదోను రాజ్యంలో ప్రజలు బాలుని కొల్చేవాళ్లు కనుక ఆ రాణి తన పట్టింటి మతాన్ని యిస్రాయేలు దేశానికిగూడ తీసికొని వచ్చింది. ఆ రోజుల్లో యిస్రాయేలు చుట్టపట్లవున్న కనానీయ జాతులన్నీ ఈ దేవుణ్ణి కొల్చేవి. కనుక యావేపట్ల భక్తిలేని యూదులు చాలమంది ఈ బాలు ఆరాధనలో పడిపోయారు. ఆ రోజుల్లో ఇది పెద్ద సమస్య ఐంది. అహాబు రాజు ఆర్థిక రాజకీయ విషయాలేగాని మతవిషయాలు పట్టించుకొనేవాడు కాదు. ఈలాంటి పరిస్థితుల్లో ప్రభవు ఏలీయా ప్రవక్తను తన సేవకు పిల్చాడు. ఈ ప్రవక్త బాలు ఆరాధనను నిరసించి యావే మతాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొన్నాడు. అతడు యావే ప్రభువుపట్ల మహాభక్తి ఆసక్తి కలవాడు. పూర్వవేదంలోని భక్తాగ్రేసరుల్లో వొకడు. ఈ కథలోను రాబోయే కథల్లోనుగూడ మనం ఏలీయా చరిత్రను చూస్తాం. యేలీయా అతని శిష్యుడైన యెలీషా కథలు యిస్రాయేలీయుల జానపద గాథలకు సంబంధించినవి. హీబ్రూ రచయితలు నిష్కపటులైన పల్లె ప్రజలను ఉద్దేశించి మొదట ఈ కథలను చెప్పారు.

2. వివరణం

ఈ యధ్యాయంలో రెండు భాగాలున్నాయి. మొదటిది, అనావృష్టి వస్తుందని యెలీయా ముందుగానే రాజుకి తెలియజేయడం-1-7, రెండవది, వితంతువు కథ 8-24. మొదట అనావృష్టి కథను చూద్దాం. ఏలీయా రాజు దగ్గరికి వెళ్ళి నేను బాలుని నిరాకరించి యావే ప్రభువుని కొల్చే ప్రవక్తనని చాటిచెప్పకొన్నాడు. దేశంమీదికి కరువు వస్తుందనీ, తాను కురవమంటేనేగాని వాన కురవదనీ ఖండితంగా చెప్పాడు. యావేమతానికీ బాలు మతానికీ బద్దవైరం. బాలు వరానికీ పైరుపంటలకీ జంతుగణాభివృద్ధికీ నరసంతానానికీ అధిపతియని అతని భక్తుల నమ్మకం. ఏలీయా నేను దేశంమీదికి కరువు తెప్పిస్తాను, మీరు కొల్చే బాలు నిజంగా దేవుడైతే వాన కురిపించమనండి చూద్దాం అని రాజుని సవాలు జేసాడు. అసలు అహాబు విగ్రహారాధన పాపంవల్లనే కరువు వచ్చిందని ఎత్తిపొడిచాడు.