పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరచి దేవునికి ద్రోహం చేస్తాం. కనుక సౌలు చెప్పినట్లుగా మనం భయంతో వణకుతూ మన రక్షణకార్యాన్ని సాధించాలి - ఫిలి 2,12. నిల్చివున్నవాడు పడిపోకుండా వుండేలా జాగ్రత్తపడాలి - 1కొరి 10,12, కావున భయభక్తులతో దేవుణ్ణి కొలిచే భాగ్యాన్ని అడుగుకొందాం.

10. రాజ్య విభజనం 1రాజు 11,26-12, 24

1. సందర్భం

సొలోమోను గొప్ప రాజు, వైభవంగా యిస్రాయేలీయులను ఏలాడు. కాని అతడు

విగ్రహారాధకుడు. కనుక ప్రభువు అతనిపై కోపించి అతని రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. చరిత్రను మన జీవితంలోని సంఘటనలను నడిపించేది ప్రభువే.

2. వివరణం

సొలోమోను రాజు వెట్టిచాకిరివారిని నియమించి ఏప్పడూ భవనాలు కట్టిస్తూండేవాడు. అతడు ఆ చాకిరివారికి యరోబాము అనే సేవకుణ్ణి నాయకుణ్ణిచేసాడు. దైవప్రేరణం వల్ల ఈ సేవకుడే సాలోమోనుకి ప్రబల శత్రువు అయ్యాడు.

ఓసారి అహీయా ప్రవక్త యెరూషలేము ప్రక్కన వున్నపొలంలో ఈ యరోబాముని కలసికొన్నాడు. అప్పడు ప్రవక్త కొత్త అంగీని ధరించి వున్నాడు. అతడు ఆ యంగీని పండ్రెండు ముక్కలుగా చించి పదింటిని యరోబాముకిచ్చి నీవు వీటిని తీసికో అన్నాడు. దీని భావమిది. సొలోమోను రాజ్యంలో పండ్రెండు తెగల యిస్రారాయేలీయులున్నారు. వారిలో యూదా బెన్యామీను అనే రెండు తెగలవారికి మాత్రమే ఇకమీదట సొలోమోను వారసులు రాజులౌతారు. తతిమ్మా పది తెగలు చీలిపోయి కొత్త రాజ్యమౌతాయి. వీటికి యరోబాము అతని అనుయాయులు రాజులౌతారు.

ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించేవాళ్ళు. ఈ సంఘటనం అలాంటి నటనాత్మకమైన బోధ. అహీయా ప్రవక్త సొలోమోనుకి విరోధి. ఆ రాజు ప్రభువు ధర్మశాస్తాన్ని మీరడం జూచి ,అహీయా మరికొందరు ప్రవక్తలు అతన్ని ఎదిరించారు. సాలోమోను అన్యజాతుల దైవాలను పూజించి ప్రభువుకి ద్రోహం చేసాడు. కనుక దేవుడు అతని రాజ్యాన్ని రెండు ముక్కలు చేసాడు. ఈ సంగతిని అతడు తన భక్తుడైన ప్రవక్తద్వారా ముందుగానే ఎరిగించాడు.