పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మృతశరీరాన్ని రాతి బండయందు తొలిచిన సమాధిలో వుంచారు. అంతకుముందు ఆ సమాధిలో ఎవరినీ ఉంచలేదు. క్రీస్తు తర్వాత ఇంకెవ్వరినీ ఉంచలేదు. అలాగే కన్యమాత గర్భంకూడాను. క్రీస్తు జన్మింపక ముందుగాని, జన్మించినంకగాని ఆ గర్భంలో మరో శిశువు నెలకొనలేదు. క్రీస్తు సమాధిరాతిని ఛేదించకుండానే వెలుపలకు వచ్చాడు. గది తలుపులు తీయకుండానే గదిలోపల ప్రవేశించాడు. అలాగే ప్రభువు మరియ కన్యాత్వం చెడకుండానే ఆమె గర్భంలో ప్రవేశించాడు. కన్యాత్వం చెడకుండానే ఆమె గర్భం నుండి వెలువడ్డాడు.

మామూలుగా కన్య తల్లి కాలేదు, తల్లి కన్యగా వుండలేదు. ఐనా మరియ మాత్రం కన్య, తల్లికూడ. ఆమె కన్యగా వుండిపోయింది తన్ను తాను దేవుని సమర్పించుకొనడం కోసం అన్నాం, తాను మాతృమూర్తి కావడం ద్వారా ఈ సమర్పణ భావం ఫలసిద్ధి నందింది. తన్ను తాను అంకితం చేసికొనిన దేవుణ్ణి అధికానురాగంతో ప్రేమించింది. పైగా కన్యగా వుండడంవల్ల ఆమె హృదయం అవిభక్తంగా వుండిపోయింది. కనుక మరియ తన దేవుడు, పుత్రుడు ఐన క్రీస్తుని కన్యా హృదయంతోను, మాతృ హృదయంతోను ప్రేమించిందని చెప్పాలి.

5. కన్య మరియ బోధించే సత్యాలు

ఈ సందర్భంలో కన్య మరియు మనకు మూడు సత్యాలను జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, కన్యాత్వం రాబోయే మోక్ష సామ్రాజ్యపు జీవితాన్ని సూచిస్తుంటుంది. వివాహంద్వారా బిడ్డలను కంటాం. కాని ఈలా పట్టిన నరులకు మరణం తథ్యం. ఐతే కన్యాత్వం మరణాన్ని జయించే మోక్ష జీవితాన్నీ ఉత్థాన జీవితాన్నీ సూచిస్తూంది - లూకా 20, 34-36. కనుక వివాహ జీవితం మరణానికీ, కన్యా జీవితం శాశ్వత జీవానికీ సంకేతంగా వుంటాయి.

రెండవది, కన్యాత్వమంటే దేవునికి సమర్పితం కావడం. దేవుని సన్నిధిలో నడవడం. ఆ దేవునికి పరిచర్య చేయడం. ఆ దేవునికోసం తోడిప్రజలను ఆదరించడం. కన్య భగవంతునికి నివేదిత కావున పవిత్రమూర్తి సమర్పణమే కన్యాత్వపు ప్రధాన విలువ.

మూడవది, కన్యాత్వాన్ని మనంతట మనం పాటించలేం. ఆది భగవంతుడు అనుగ్రహించే వరం. మొదటి ధన్యవచనం సూచించే దీనాత్మలు దేవునివద్ద నుండి పొందే భాగ్యం - మత్త 5,3. కనుక మనం దీనభావంతో ఈ భాగ్యాన్నిదేవుని వద్దనుండి అడుగుకోవాలి.