పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విడిపించి కనాను దేశానికి తీసికొని వచ్చాడు. వారితో ఒప్పందం చేసికొన్నాడు. తాను వారికి దేవుడూ, వారు అతనికి భక్తులూ అయ్యారు. ఈ ఉపకారాలకు దావీదు ప్రభువుకి సమాజపరంగా వందనాలు అర్పించాడు. అతని ప్రార్ధన మనకుగూడ కృతజ్ఞతాభావాన్ని నేర్పిస్తుంది.

3. ప్రార్థనా భావాలు

1.మెస్సీయా రాజుగా వస్తాడు, దావీదు కుటుంబంలో పుడతాడు అని యూదులు శతాబ్దాల పొడుగునా ఉత్సాహంతో ఎదురుచూస్తూ వచ్చారు. వాళ్ళ ప్రవక్తలు ఈ యంశాన్ని పురస్కరించుకొని ఎన్నో ప్రవచనాలు చెప్పారు. మెస్సీయా రాజు అనే ప్రవచనాలకు నాతాను సందేశమే ఆధారం. ఐతే క్రీస్తుపూర్వం 587లో బాబిలోనియా ప్రవాసంతో దావీదు వంశం అంతరించింది. ఆ పిమ్మట దావీదు వంశపు రాజులు లేరుకాని దావీదు కుటుంబం మాత్రం కొనసాగింది. యోసేపు ఈ దావీదు కుటుంబానికి చెందినవాడే. అతని పెంపుడు కొడుకే క్రీస్తు. యోసేపు ద్వారా క్రీసు దావీదు కుటుంబానికి చెందినవాడయ్యాడు. దావీదు కుమారుడయ్యాడు. ఈ క్రీస్తురాజు రాజ్యానికి అంతం ఉండదు. అతడు శాశ్వతంగా రాజు - లూకా 1,32-33. దావీదు రాజవంశం ఏనాడో అంతరించినా అది క్రీస్తుద్వారా శాశ్వతంగా కొనసాగిపోతుంది. ఆ ప్రభువు నాడు యిస్రాయేలీయులకూ నేడు మనకూగూడ రక్షణాన్నిచ్చేవాడు. క్రీస్తు మనలను సంపూర్ణంగా రక్షించాలని ప్రార్థిద్దాం.

2.దావీదు మందిరం కట్టకపోయినా దేవుడు అతని మంచి కోరికను మెచ్చుకొన్నాడు. తానే అతనికి ఓ మందిరాన్ని కట్టిపెడతానని వాగ్దానం చేసాడు. దేవుడు దావీదుకి కట్టిపెట్టే మందిరం అతని రాజవంశమే. ఆ వంశంనుండే మెస్సీయా ఉద్భవిస్తాడు. అతనిద్వారా దావీదు రాజవంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఈ దావీదులాగే మనకు గూడ మంచి కోరికలుండాలి. మంచి కోరికలు ప్రార్థనల్లాంటివి. మంచికోరికలంటే యేమిటివి? మతం వ్యాప్తిచెందాలి. గురువులు మఠకన్యలు పవిత్రంగా జీవించాలి. ప్రజల్లో భక్తివిశ్వాసాలు పెరగాలి. పాపం అంతరించాలి. దేవుని చిత్తమైతే మనచుటూవున్న అన్యమతస్థులుకూడ ప్రభువు శిష్యులు కావాలి. అతని బోధలను ఆలించాలి. చాలమంది యువతీయువకులు దైవసేవలో చేరాలి. ఈలాంటి భక్తిగల కోరికలను మనం నిరంతరం కోరుకొంటూండాలి. వీటిని